Presidential Elections
presidential elections : భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 8 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక పెన్నులను సరఫరా చేసింది.
బ్యాలెట్ పత్రం అందజేసినప్పుడు పోలింగ్ కేంద్రంలో.. ఓటర్‌కు ఆ పెన్ను అందజేస్తారు. ఓటర్లు ఆ పెన్నుతోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను కాకుండా మరే ఇతర పెన్నుతోనైనా ఓటు వేస్తే అది చెల్లదు. కౌంటింగ్ సమయంలో ఆ ఓటును చెల్లని ఓటుగా ప్రకటిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
Presidential Election : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్స్
హైదరాబాద్.. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1, అసెంబ్లీ భవనాలు, పబ్లిక్ గార్డెన్‌లో రెండు ఓటింగ్ కంపార్ట్ మెంట్లను సిద్ధం చేశారు. పోలింగ్ సజావుగా సాగేలా చేసిన ఏర్పాట్లను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ పరిశీలించారు. ఈ నెల 18న హైదారాబాద్‌లోని అసెంబ్లీలో రాష్ట్రానికి చెందిన 119మంది ఎమ్మెల్యేలతో పాటు ఏపీలోని కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటు వేయనున్నారు.
అటు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్-1లో అధికారులు పోలింగ్ ఏర్పాట్లు చేశారు. 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 25 మంది లోక్‌సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు కూడా పోలింగ్‌లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల విధుల్లో 50 మందికి పైగా అసెంబ్లీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.