రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీలో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉండగా.. లేటెస్ట్‌గా రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
లండన్ నుంచి మార్చి 20వ తేదీన రాజమహేంద్రవరం వచ్చిన యువకుడికి కరోనా వైరస్ సోకినట్టు డాక్టర్లు వెల్లడించారు. అలాగే, పారిస్ నుంచి మార్చి 15న ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి మార్చి 17న ఓ యువకుడు విజయవాడ చేరుకున్నాడు. 20న ఆస్పత్రిలో చేరగా.. అతనికి పాజిటివ్ అని తేలినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతుండగా.. భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 315కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.