కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొదట కరోనా వైరస్ లక్షణాలతో హాస్పిటల్ లో చేరిన పేషెంట్ ను త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు డాక్టర్లు.
కేరళలో మొదటి కరోనా వైరస్ కేసు త్రిసూర్ జిల్లాలో బయటపడిన సంగతి తెలిసిందే. గత నెలలో చైనాలోని చైనాలోని వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన వారం రోజుల్లోనే ఓ విద్యార్థిని భారత్ లోనే మొదటిసారిగా కరోనా వైరస్ లక్షణాలతో త్రిసూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేరింది. జనవరి-30,2020న చేసిన పరీక్షల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యవతిని హాస్పిటల్ లో ఉంచి ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. అయితే ఆ యువతి శరీరంలో ఇప్పుడు కరోనా వైరస్ లేదని పరీక్షల్లో తేలింది. కేరళలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)పలుసార్లు శాంపిల్స్ ను పరీక్షించిన తరువాత ఆమె శరీరంలో కరోనా లక్షఃణాలు పోయినట్లు చెప్పింది. అయితే పూణే NIV నుంచి రిపోర్ట్ ల కోసం హెల్త్ అధికారులు ఇంకా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు భారత్ లో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ ముగ్గురు చైనా నుంచి కేరళకు తిరిగివచ్చినవారే. దీంతో కరోనా వైరస్ ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ ఇటీవల ఆ స్టేటస్ ను ఉపసంహరించుకుంది. కరోనా రాష్ట్ర విపత్తు కాదని తేల్చింది. ధృవీకరించబడిన కేసులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 80 మందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం 2వేల మందిని వారి వారి ఇళ్లల్లోనే ప్రభుత్వం వైద్య పర్యవేక్షణలో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 70మంది ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
గడిచిన నాలుగైదు వారాల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20దేశాలకు పైగా పాకింది. ఇప్పటికే వరల్డ్ హైల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడ అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని సైంటిస్టులు కృషి చేస్తున్నారు. మరోవైపు చైనాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 908మంది ప్రాణాలు కోల్పోయినట్లు,41,171మందికి పాజిటివ్ అని తేలి హాస్పిటల్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం చైనాలో 24వేల మంది మృతి చెందినట్లు సమాచారం.