Nitish Kumar Wife: జనతా దళ్ (యునైటెడ్) అధినేత, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సభ్యుడు నితీష్ కుమార్ గురువారం బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దివంగత భార్య మంజు కుమారి సిన్హా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నితీష్ కుమార్ దివంగత భార్య మంజు కుమారి సిన్హా వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. కష్టకాలంలో నితీశ్ కు మద్దతిచ్చారు. 1973లో వీరి వివాహం జరిగింది.
మంజు కుమారి సిన్హా ఎవరు?
మంజు దేవి అని ప్రేమగా పిలువబడే మంజు కుమారి సిన్హా విద్యావంతులైన కుటుంబం నుండి వచ్చారు. టీచింగ్ వృత్తిలో కొనసాగారు. పాట్నాలోని కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్ గా పని చేశారు.
నితీష్ కుమార్ అర్ధరాత్రి బైక్ పై..
1985లో నితీష్ కుమార్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత భక్తియార్‌పూర్ తిరిగి వచ్చినప్పుడు ఘన స్వాగతం లభించింది. కానీ ఆయన భార్య మంజు ఆయనను స్వాగతించడానికి అక్కడ లేరు. ఏదో పని మీద తల్లి ఇంటికి వెళ్ళారు. తన పక్కన తన భార్య కనిపించకపోవడంతో, నితీష్ భక్తియార్‌పూర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవ్ దాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన సహచరులతో కలిసి మోటార్ బైక్ పై మంజును కలవడానికి 40 కిలోమీటర్లు ప్రయాణించారు. ఊహించని రీతిలో తన భర్త ఇంటి గుమ్మం ముందు కనిపించడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుతున్న సమయంలో.. నితీష్, మంజు 1973 ఫిబ్రవరి 22న వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో, సిన్హా పాట్నాలోని మగధ మహిళా కాలేజీలో సోషియాలజీ చదువుతున్నారు. ఈ జంటకు నిశాంత్ కుమార్ అనే ఒక కుమారుడు జన్మించాడు. మంజు కుటుంబంపై దృష్టి సారించి తన రాజకీయ జీవితంలో నితీష్‌కు అతిపెద్ద మద్దతుగా నిలిచారు.
తన రాజకీయ ప్రయాణంలో సవాళ్లతో కూడిన సమయంలో నితీష్‌కు నైతిక మద్దతు అందించారు మంజు. నితీష్ ప్రధాన నిర్ణయాల వెనుక మార్గదర్శక శక్తిగా.. స్నేహితులు కుటుంబ సభ్యులు ఆమెను గుర్తుంచుకుంటారు.
భార్యకు ఉద్యోగం ఇప్పించడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు..
నితీష్ కుమార్ తన భార్యను ఢిల్లీకి పిలిపించడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించారని అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాని కారణంగా ఆయన కలత చెందారు. అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు లేఖ రాశారు. మంజు డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఆ తర్వాత ఆమె పాట్నాకు తిరిగి వచ్చారు. నితీష్ అవకాశం దొరికినప్పుడల్లా భార్య, కొడుకును కలవడానికి ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్లేవారు. సెలవుల్లో భార్య, కొడుకు ఢిల్లీకి వెళ్లే వారు.
మంజు కుమారి సిన్హా విషాద మరణం..
మంజు సిన్హా మే 14, 2007న 53 సంవత్సరాల వయసులో మరణించారు. తీవ్రమైన న్యుమోనియా కారణంగా ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో మరణించారు. ఆమె అకాల మరణం నితీష్ కుమార్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె మృతదేహాన్ని పాట్నాకు తీసుకొచ్చి గంగా నది ఒడ్డున దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబసభ్యులు.
Also Read: ఒక్కసారి ఎమ్మెల్యే.. పదోసారి సీఎం.. నితీశ్ కుమార్ స్పెషాలిటీలు ఇవే.. అరుదైన రికార్డు.. దటీజ్ నితీశ్