Nitish Kumar : ఒక్కసారి ఎమ్మెల్యే.. పదోసారి సీఎం.. నితీశ్ కుమార్ స్పెషాలిటీలు ఇవే.. అరుదైన రికార్డు.. దటీజ్ నితీశ్

Nitish Kumar : బిహార్‌లో ఎన్డీఏ శకంలో మరో దశ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా నితీశ్ పదోసారి బాధ్యతలు చేపట్టడంతో ఓ అరుదైన రికార్డ్ సొంతం

Nitish Kumar : ఒక్కసారి ఎమ్మెల్యే.. పదోసారి సీఎం.. నితీశ్ కుమార్ స్పెషాలిటీలు ఇవే.. అరుదైన రికార్డు.. దటీజ్ నితీశ్

Nitish Kumar

Updated On : November 20, 2025 / 8:27 AM IST

Nitish Kumar : బిహార్‌లో ఎన్డీఏ శకంలో మరో దశ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా నితీశ్ పదోసారి బాధ్యతలు చేపట్టడంతో ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నట్లైంది. తద్వారా ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర, అలానే బిహార్‌లో సుదీర్ఘకాలం సిఎంగా బాధ్యత చేపట్టిన రికార్డు సృష్టించారు. ఇప్పటిదాకా 19 ఏళ్లు బిహార్‌ని పాలించగా.. కొత్త టర్మ్‌తో ఆ కాలం 24ఏళ్లకి చేరే అరుదైన రికార్డు ముంగిట నిలిచారు.

సరికొత్త రికార్డు దిశగా నితీశ్..
దేశచరిత్రలో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసినవారిలో రకరకాల చరిత్ర సృష్టించిన నేతలు ఉన్నారు. వారిలో సిక్కిం రాష్ట్రానికి ఏకధాటిగా పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్లు సిఎంగా పని చేశారు. 1994 డిసెంబర్ నుంచి 2019 మే వరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఒడిశాకి నవీన్ పట్నాయక్ 2000 మార్చి నుంచి 2024 జూన్ వరకూ 24ఏళ్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకి ముందే అంటే 1977 నుంచి 2000 వరకూ పశ్చిమబెంగాల్‌కి జ్యోతిబసు ముఖ్యమంత్రిగా 23ఏళ్లు కొనసాగి అరుదైన రికార్డ్ సృష్టించారు. అప్పటికదే రికార్డ్ కాగా.. ఆ తర్వాతి కాలంలో పవన్ కుమార్ చామ్లింగ్, నవీన్ పట్నాయక్ అత్యధిక కాలం అందులోనూ.. ఏకధాటిగా పరిపాలించి ఆ రాష్ట్రాల్లో చరిత్రలో నిలిచారు. ఇప్పుడు నితీశ్ కుమార్ ముంగిట కూడా ఒక్క వారం మినహా ఏకధాటిగా బిహార్‌ని పాలించిన సిఎంగా రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఇక వివిధ రాష్ట్రాల్లో విడతల వారీగా ముఖ్యమంత్రి పదవిని ఎక్కువ కాలం నిర్వహించిన వారిలో హిమాచల్ ప్రదేశ్‌కి వీరభద్రసింగ్, మిజోరం రాష్ట్రానికి లాల్ ధన్హావ్లా చెరో 21 ఏళ్లపైకి పైగా పదవిని నిర్వహించారు. అయితే, ఇలా ఎక్కువకాలం పదవీబాధ్యతలను నిర్వర్తించడానికి ఆ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు మాత్రమే కాకుండా.. వారిపై అక్కడి జనం పెట్టుకున్న నమ్మకం కూడా కారణంగా చూడాలి. అలానే ఎక్కువమంది ప్రాంతీయపార్టీల అధినేతలు కావడంతో పాటు.. జాతీయ పార్టీల అధినాయకత్వాలు వారిని ప్రోత్సహించడం కూడా ఈ అత్యధికకాలం పాలనపగ్గాలు చేపట్టడానికి దోహదపడిన అంశాలుగా చెప్పొచ్చు.

ఒక్కసారి ఎమ్మెల్యే..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ విషయానికే వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన ఈయన తర్వాతి కాలంలో సోషల్ ఇంజనీరింగ్‌లో టాప్ అవుతాడని ఊహించి ఉండరు. ఎమర్జెన్సీకి ముందు అంటే 1974 నుంచి 77 వరకు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో.. జైలు శిక్ష అనుభవించిన నాయకుల్లో నితీశ్ కూడా ఒకరు. 1977, 80, 85 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. కానీ, 1985లో మాత్రమే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1985లో హర్నాట్ నుంచి ఎమ్మెల్యేగా జనతాదళ్ తరపున బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. లోక్ సభ ఎన్నికల బరిలో బార్హ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలా 1989లో ఎంపిగా మారింది మొదలు పదిహేనేళ్లు ఎంపీగా పనిచేశారు. 1990లో కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత.. జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. అలా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తొలిసారి రైల్వే మంత్రి అయ్యారు. బెంగాల్‌లో జరిగిన గైసల్ రైలు దుర్ఘటన జరగడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

తొలిసారి సీఎంగా.. మళ్లీ వారం తరువాత..
కేంద్రమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత 2000 సంవత్సరం ఎన్నికల్లో బీహార్‌లో హంగ్ ఏర్పడటంతో తొలిసారి బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. వారం తర్వాత ఎన్డీయే బలపరీక్షలో నెగ్గడానికి సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేశారు. 2005లో దాణా కుంభకోణం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయగా.. ఆర్జేడీపై ఎన్డీయే విజయం సాధించింది. 2014లో జేడీయూకి ఎన్డీయేతో సంబంధాలు తెగిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ దారుణంగా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో ప్రత్యర్థి అయిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశారు. అదే మహాగత్ బంధన్. అప్పుడు నితీశ్ కుమార్ యాదవ్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 2017లో మళ్లీ మహా‌గత్ బంధన్ నుంచి బయటకొచ్చి. ఎన్డీయేలో చేరారు. అప్పుడు కూడా సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీయే కూటమి సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. 2022లో మరోసారి ఎన్డీయేని వదిలిపెట్టి.. మహా‌ఘట్‌బంధన్‌లో చేరారు. 2024లో మళ్లీ ఎన్డీయేలోకి తిరిగి వచ్చారు. తిరిగి 2025లో విజయపీఠం దక్కించుకున్నారు

ప్రజానాడి తెలిసిన నేత..
రాజకీయ నేతగా నీతీశ్‌ది వినూత్న శైలి. ప్రతి ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఓసారి జంగల్‌రాజ్‌ నిర్మూలన అంటే, మరోసారి వెనుకబడిన వర్గాల సంక్షేమం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 125 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలుచేస్తున్న ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజనను ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేసింది. దీంతోపాటు ఉపాధిపై అధికంగా దృష్టిపెట్టిన అజెండాను ప్రకటించారు. ఇవన్నీ ఎన్డీఏకు కలిసొచ్చాయి. దీంతో.. మరోసారి నీతీశ్‌ సీఎం పీఠం ఎక్కారు. వచ్చే ఐదేళ్లు నితీశ్ సీఎంగా కొనసాగితే దేశంలోనే అత్యధిక సంవత్సరాలు సీఎంగా కొనసాగిన నేతగా నితీశ్ రికార్డు నెలకొల్పనున్నారు.