Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!

ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు జాతీయ రాజకీయాల్లో (National Politics) సరికొత్త చర్చకు దారితీసాయి.. బాబు అరెస్టు అక్రమమంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఖండించగా, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ట్రెండ్‌గా మారిందని చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. (Akhilesh Yadav) ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులు (Communist Parties) కూడా ఇప్పటికే బాబు అరెస్టును ఖండించాయి. ఇప్పటికైనా బాబు బీజేపీకి దూరంగా జరగాలని సూచించాయి.. ఇవన్నీ గమనిస్తే బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్న బాబును తమవైపు లాగేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి చురుగ్గా పావులు కదువుతున్నట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఇండియా కూటమి వ్యూహామేంటి? బాబు ముందున్న ఆప్షన్లేంటి?

ఇండియా కూటమి సౌత్ లో కొంత స్ట్రాంగ్ గా ఉన్నా లోటంతా ఏపీలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల రాజ్యమూ.. రాజకీయమే నడుస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కు ఒకప్పుడు ఏపీలో గట్టి పునాది ఉండేది.. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. కానీ ఏపీలో 25 ఎంపీ సీట్లు ఇండియా కూటమిని ఆ రాష్ట్ర రాజకీయంపై ఫోకస్ పెట్టేలా చేస్తున్నాయి. ఏపీలో కొన్ని ఎంపీ సీట్లు కూటమికి దక్కితే కేంద్రంలో అధికారం హస్తగతం అవుతుందని భావిస్తోంది ఇండియా కూటమి. ఐతే ఏపీ పార్టీలన్నీ బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఇండియా కూటమి అలర్ట్ అయింది. బాబును ఆకర్షించే పని స్టార్ట్ చేసి బెంగాల్ సీఎం మమతబెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌న రంగంలోకి దింపింది.

Chandrababu Naidu, Mamata-Banerjee (Photo: Google)

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా స్వరం పెంచుతున్నాయి. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. మొదట కమ్యూనిస్టులు, కాంగ్రెస్ స్ధానిక నేతలు ఖండన ప్రకటనలు చేయగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ బహిరంగ ప్రకటనతో ఇండియా కూటమి వ్యూహానికి పదునుపెట్టినట్లు కనిపిస్తోంది. ఎలాంటి విచారణ లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమమంటూ ప్రకటించారు మమతాబెనర్జీ.

Akhilesh Yadav, Chandrababu Naidu (Photo: Google)

ఇక యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం చంద్రబాబు అరెస్టు కావడాన్ని తప్పుపట్టారు. ప్రతిపక్ష నేతల అరెస్టు దేశంలో ఓ ట్రెండ్‌గా మారిపోయిందని ట్వీట్ చేశారు అఖిలేశ్. స్వార్థపూరిత రాజకీయాలు చేసే బీజేపీకి ఎవ్వరూ మిత్రులుగా ఉండకూడదని చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తన ఎక్స్‌లో కామెంట్ చేశారు .. అఖిలేశ్, మమతాబెనర్జీ ఇద్దరూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమిలో కీలక నేతలు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తున్న నేతలు.. కీలక రాష్ట్రాలు, ముఖ్యమైన నేతలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో తెలుగు రాష్ట్రాల నుంచి కమ్యూనిస్టులు తప్ప ప్రధాన పార్టీలు దేనికీ భాగస్వామ్యం లేకపోవడంతో టీడీపీని కలుపుకునేలా ఇండియా కూటమి గాలం వేస్తోందనే చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్ర రాజకీయాలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. తాజాగా చోటుచేసుకున్న జాతీయ రాజకీయ పరిణామాలపైనా ఆచితూచే స్పందించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీ సహకారం ఉండాలని నమ్ముతున్న బాబు.. ఎప్పటి నుంచో బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీడీపీకి దగ్గరౌతున్న జనసేనాని పవన్ కూడా బాబు, బీజేపీ మధ్య మైత్రికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు జరగడంతో ఇండియా కూటమిలోని రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దల సహకారంతోనే బాబు అరెస్ట్ జరిగిందని అరోపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కీలక నేత చంద్రబాబును అక్కున చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో మేలు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను రంగంలోకి దింపిందని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ బాబు అరెస్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఆ కూటమిలో ప్రధాన నేతలు బహిరంగంగానే స్పందించడంతో బాబుతో మైత్రికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోందనే ప్రచారం ఊపందుకుంది. ఐతే చంద్రబాబు కానీ, టీడీపీ కాని మమత, అఖిలేశ్ ప్రకటనలను సానుభూతి సందేశాలుగానే చూస్తున్నారు కాని.. మారబోయే రాజకీయానికి సంకేతంగా పరిగణించడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు జైలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల కోసం ఆలోచించడం సరైనది కాదనే భావనలో ఉన్నారు టీడీపీ నేతలు.

Also Read: న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది : సిద్ధార్థ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీ సహకారం అవసరమన్న ఉద్దేశమే చంద్రబాబును జాతీయ రాజకీయాలకు దూరం చేసిందనేది వందశాతం నిజం. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతోనూ.. అటు కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీతోనూ ప్రతిపక్షంలో ఉంటూ ఏకకాలంలో యుద్ధం చేయడం సాధ్యం కాదన్న వ్యూహంతోనే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే వైసీపీపై రాజీలేకుండా పోరాడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ-వైసీపీ మధ్య రహస్య స్నేహం ఉందనే ఆరోపణలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు బాబు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు కావడానికి ఈ రహస్య స్నేహమే కారణమంటూ ఆరోపిస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కూడా.

Also Read: చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్

బీజేపీ, వైసీపీ బంధంపై ఎవరు ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చినా.. టీడీపీ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో శతృత్వం పెంచుకునే పొరపాటు చేయకూడదన్నట్లే నడుస్తున్నారు టీడీపీ నేతలు. అందుకే ఇండియా కూటమి నుంచి సానుభూతి ప్రకటనలు వస్తున్నా.. తొందరపాటు ప్రకటనలు ఏవీ చేయకుండా నిగ్రహం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా కూటమి స్నేహ హస్తం చాస్తున్నా.. జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. బీజేపీతో మంచి జరగపోయినా.. కీడు జరగకూడదనే భావనలో జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండటం మేలైన పరిష్కారంగా చెప్పుకుంటున్నారు.

Also Read: చంద్రబాబు అరెస్ట్‌పై అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం

ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి సంకట పరిస్థితి ఎదుర్కోలేదని చెబుతున్నారు పరిశీలకులు. ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం. ఏదిఏమైనా ఆపదలో ఉన్న చంద్రబాబుకు ఆపన్నహస్తం ఇచ్చేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోందనే ప్రచారం జాతీయ స్థాయి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ట్రెండింగ్ వార్తలు