It Appears Centre Wants People To Die Delhi Hc Blasts Centre
DELHI HC కేంద్రప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెమ్ డెసివర్ ఇంజెక్షన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కరోనా ట్రీట్మెంట్ కోసం రెమ్ డెసివర్ వాడకంపై కేంద్రం కొత్త ప్రొటోకాల్ తీసుకురావడంపై బుధవారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది పూర్తిగా తప్పు. ఇది పూర్తిగా మతి లేని పని. ఆక్సిజన్ దొరకని ప్రజలకు ఇప్పుడు రెమ్ డెసివర్ కూడా దొరకదు. ప్రజలు చావాలని కేంద్రప్రభుత్వం అనుకుంటున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ప్రతిభా ఎమ్ సింగ్ వ్యాఖ్యానించారు. రెమ్ డెసివర్ కొరతను తగ్గించేందుకే కేంద్రప్రభుత్వం ప్రొటోకాల్ ను మారుస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. ఇది పూర్తిగా నిర్వహణాలోపం అని తెలిపింది.
కాగా, కోవిడ్-19తోభాధపడుతున్న ఓ న్యాయవాది..తాను ఆరు డోసుల రెమ్ డెసివర్ పొందాల్సి ఉండగా, కేంద్రం కొత్త ప్రొటోకాల్ కారణంగా కేవలం మూడు మాత్రమే పొందగలిగానని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. అయితే, ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సదరు లాయర్ కి మిగిలిన డోసులు మంగళవారం రాత్రి అందాయి.