Jammu and Kasmir, Haryana Exit Poll 2024
Jammu and Kasmir, Haryana Exit Poll 2024: హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ (శనివారం) సాయంత్రం విడుదల కానున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా.. సాయంత్రం 6గంటలకు ముగియనుంది. అనంతరం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు 8వ తేదీన జరగనుంది. తుది ఫలితాలు అదేరోజు వెల్లడికానున్నాయి.
Also Read : ManuBhaker: తొలిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మనుభాకర్.. పోలింగ్ బూత్ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్
హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దఫాలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి. హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. ఈసారి మేము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. దీంతో హర్యానా ప్రజలు ఎవరికి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Also Read : Haryana Elections 2024: హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖులు వీరే..
జమ్మూకాశ్మీర్ లో 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పదేళ్ల తరువాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో జమ్మూకాశ్మీర్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా.. బీజేపీ, పీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. జమ్మూకాశ్మీర్ లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన మూడు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 61.38 శాతం ,రెండో విడతలో 57.13 శాతం, మూడో విడతలో 69.65 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాలి.. ఎవరైనా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వారికి జరిమానా, జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది.