కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ తెలిపింది. (ఆదివారం పనిచేయకపోయినా జీతాలివ్వండి: మోడీ)
ప్రజలు ఇళ్లలో ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కరోనాపై పోరాటం చేయడం చాలా ముఖ్యమైనదని పేర్కొంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది.
మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో తాము ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 31వరకు షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశాయి.