కర్ణాటకలో ప్రైవేట్‌ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు.. 100 శాతం కోటాపై ఆందోళన

కర్ణాటకలోని ప్రైవేట్‌ కంపెనీల్లో గ్రూప్‌ సి, గ్రూప్‌ డి ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది.

Karnataka private jobs quota bill and why CM Siddaramaiah deletes social media post

Karnataka private jobs quota bill: కర్ణాటకలో స్థానికులకే ఉద్యోగాలు అంటూ ప్రభుత్వం చేసిన 100 శాతం కోటా ప్రకటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ కంపెనీల్లో గ్రూప్‌ సి, గ్రూప్‌ డి ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్‌ మీడియాలో చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో ‘సి, డి’ గ్రేడ్‌ల పోస్టుల్లో 100 శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లుకు నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపిందని తన ప్రకటనలో పేర్కొన్నారు. కన్నడిగులు తమ రాష్ట్రంలో సుఖంగా జీవించేందుకు అవకాశం కల్పించాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాగా, స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోక‌ల్ ఇండ‌స్ట్రీస్ ఫ్యాక్ట‌రీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్ 2024ను కర్ణాటక కేబినెట్ ఆమోదించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నాస్కామ్ ప్రకటన చేసింది.

వ్యతిరేకించిన వ్యాపారవేత్తలు
సీఎం సిద్ధరామయ్య ప్రకటనపై వ్యాపారవేత్తలు మండిపడ్డారు. ఫాసిస్ట్, వివక్షపూరితంగా ఈ బిల్లు ఉందని.. ఇది అమలైతే బెంగళూరులోని ఐటీ పరిశ్రమ కుప్పకూలడం ఖాయమని పలువురు బిజినెస్ లీడర్లు పేర్కొన్నారు. పరిశ్రమలు తరలిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు హస్వదృష్టితో ఈ బిల్లు తయారు చేసిందని అసోచామ్ కర్ణాటక కో-ఛైర్మన్ ఆర్కే మిశ్రా విమర్శించారు. తిరోగమనపూరితంగా ఉందని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఫైర్ అయ్యారు.

ఆచితూచి స్పందించిన కిరణ్ మజుందార్
బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా ఆచితూచి స్పందించారు. అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగ నియామకాల్లో మినహాయింపు ఇవ్వాలని ఆమె సూచించారు. స్థానికులకు ఉపాధి కల్పించాలనే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉన్న బెంగళూరుకు ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. టెక్ హబ్ గా ఉన్న బెంగళూరులో నైపుణ్యం కలిగిన ప్రతిభ ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

కార్మిక శాఖ మంత్రి క్లారిటీ
వ్యాపారవేత్తల స్పందనపై కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ.. వారి అభిప్రాయాలను గౌరవిస్తానని, చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లపై ఆయన క్లారిటీ ఇచ్చారు. నాన్-మేనేజ్‌మెంట్ స్థాయిలో 70 శాతం, మేనేజ్‌మెంట్ స్థాయిలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులో ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఒకవేళ స్థానికంగా తగిన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరక్కపోతే ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చని వివరించారు. కాగా, ప్రైవేట్‌ కంపెనీల్లో కిందిస్థాయి ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును సీఎం సిద్ధరామయ్య డిలీట్ చేశారు.

Also Read: ప్రతి ఆదివారం అక్కడి నుంచే భోజనం తెప్పించుకుంటున్న అంబానీ కుటుంబం.. అందుకే ఇలా..

కిందిస్థాయి ఉద్యోగాలన్నీ కన్నడిగులకే..
ప్రైవేటు కంపెనీల్లోని కిందిస్థాయి ఉద్యోగాలు ఎక్కువగా కర్ణాటకలో స్థిరపడిన ఉత్తరాది రాష్ట్రాల వారు దక్కించుకుంటున్నారని ప్రతిపాదిత బిల్లులో కార్మిక శాఖ పేర్కొంది. ప్రభుత్వం అందించిన మౌలిక సదుపాయాలను వాడుకుంటున్న కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. సరోజిని మహిషి కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా బిల్లు తయారుచేసినట్టు తెలుస్తోంది. 50 మంది కంటే ఎక్కువ కార్మికులతో పనిచేసే భారీ, మధ్యతరహా, చిన్నస్థాయి పారిశ్రామిక యూనిట్లలో గ్రూప్ A ఉద్యోగాల్లో 65 శాతం, గ్రూప్ ఉద్యోగాల్లో 80 శాతం కన్నడిగులకు రిజర్వ్ చేయాలని సరోజిని మహిషి కమిటీ ప్రతిపాదించింది. గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని సిఫార్స్ చేసింది. అయితే, ఈ సిఫార్సులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి విధి విధానాలు తయారు చేయలేదు.

Also Read: ఇంత చిన్న గదికి ఇంత రెంట్ అడుగుతున్నారేంటి? బతికేది ఎలా?

ట్రెండింగ్ వార్తలు