Karpuri Thakur to be awarded Bharat Ratna posthumously
Karpoori Thakur Bharat Ratna: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ శతజయంతి సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్ మంగళవారం ప్రకటించారు.
జననాయక్ ప్రసిద్ధి చెందిన కర్పూరీ ఠాకూర్ బిహార్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన.. లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ బిహారీ నాయకులకు గురువుగా ప్రఖ్యాతిగాంచారు. అత్యంత వెనుకబడిన నాయ్ (నాయీ బ్రాహ్మణ) కులంలో పుట్టి పెద్ద నాయకుడిగా ఎదిగినా నిరాడంబరంగా జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు.
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌంజియా (ప్రస్తుతం కర్పూరి గ్రామం) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి దంపతులకు 1924, జనవరి 24న కర్పూరి ఠాకూర్ జన్మించారు. విద్యార్థి దశలో జాతీయవాద ఆలోచనలకు ప్రభావితమయి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని.. 26 నెలలు జైలు జీవితం గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విధానసభకు ఎన్నికయ్యారు.
1970లో బిహార్‌కు మొట్ట మొదటి కాంగ్రేసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన విద్యామంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా తన హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. బిహార్ లో విద్యావ్యాప్తికి విశేషమైన కృషి చేశారు. 1977లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అట్టడుగు వర్గాల రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేశారు. 1979, జూలైలో జనతా పార్టీ చీలిపోయినప్పుడు చరణ్ సింగ్ వర్గానికి అండగా నిలిచారు కర్పూరీ ఠాకూర్. 1985 ఎన్నికలలో సోన్‌బర్సా నియోజకవర్గం నుంచి విధానసభకు ఎన్నికయ్యారు. ఈ పదవీ కాలం పూర్తికాకుండానే 1988, ఫిబ్రవరి 17న ఆయన తుదిశ్వాస విడిచారు.
Also Read: అయోధ్యలో అసలేం జరిగింది.. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగిన పరిణామాలేంటి?
ప్రధాని మోదీ హర్షం
సాంఘిక న్యాయానికి దీపధారిగా నిలిచిన జన నాయక్ కర్పూరీ ఠాకూర్ కు ఆయన శతజయంతి సందర్భంలో భారతరత్న ప్రదానం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
I am delighted that the Government of India has decided to confer the Bharat Ratna on the beacon of social justice, the great Jan Nayak Karpoori Thakur Ji and that too at a time when we are marking his birth centenary. This prestigious recognition is a testament to his enduring… pic.twitter.com/9fSJrZJPSP
— Narendra Modi (@narendramodi) January 23, 2024