అయోధ్యలో అసలేం జరిగింది.. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగిన పరిణామాలేంటి?
1526 పానిపట్ యుద్ధం నుంచి 2024 జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగిన పరిణామాలేంటి?

What was history of Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir: 2024 జనవరి 22. దేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. 500 ఏళ్ల క్రితం బాబర్ కూల్చిన చోటే.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అయోధ్య రాముడి ఆలయం ప్రారంభమైన రోజు. అసలు.. రెండు వర్గాలకు వివాదంగా మారిన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఆలయం, మసీదు వివాదానికి కారణమేంటి? 1526 పానిపట్ యుద్ధం నుంచి 2024 జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగిన పరిణామాలేంటి? ఐదు నిమిషాల్లో ఈ 500 ఏళ్ల చరిత్రను తెలుసుకుందాం రండి.
1526లో జరిగిన పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి.. ఇండియాలో అడుగు పెట్టాడు బాబర్. 1528లో అయోధ్యలో మసీదు నిర్మించాలని బాబర్ కమాండర్ మీర్‌బాకీ ఆదేశంతో 1528లో ఆలయం ఉన్న చోట్ల కూల్చివేతలు చేపట్టి.. మసీదు నిర్మాణం చేపట్టారు. అయితే.. మసీదు గోపురాలలో ఒకదాని కింద రాముడి జన్మస్థలం ఉందని హిందువులు చెప్పడంతో.. 1529 నుంచి మసీదు వెలుపల వారికి పూజలు చేసుకునే వెసులుబాటు మాత్రం కల్పించారు.
1530 నుంచి 1605 వరకు ఆలయం, మసీదు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే 1556లో అక్బర్ రాజ్యాధికారం చేపట్టిన తర్వాత మసీదు ముందు భాగంలో పూజలు చేసుకునేందుకు ప్రత్యేక నిర్మాణం చేపట్టి.. దాన్ని హిందువులకు అప్పగించారు. అంతేకాదు.. వారు పూజలు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత 1658 నుంచి 1707 వరకు ఔరంగజేబు పాలించిన కాలంలో గురుగోవింద్ సింగ్ సైన్యం రామ జన్మభూమి కోసం పోరాటం సాగించింది.
ఆ తర్వాత చాలాకాలం ఈ వివాదం కొనసాగినా ఎలాంటి పరిష్కారం మాత్రం లభించలేదు. 1859లో ఈ స్థలాన్ని రెండుగా విభజించిన బ్రిటీష్ ప్రభుత్వం.. మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు, బయటి భాగాన్ని హిందువులకు కేటాయించింది. అయితే.. మసీదును ఆనుకొని ఉన్న స్థలంలో ఆలయం నిర్మించేందుకు అనుమతించాలని మహంత్ రఘుబీర్‌దాస్ 1885 జనవరి 15న వేసిన కేసుతో పాటు, 1886 ఫిబ్రవరి 24న వేసిన టైటిల్ దావాను కోర్టు తిరస్కరించింది.
1934, మార్చి 27న మత కల్లోలాలు చెలరేగి బాబ్రీ మసీదుకు సంబంధించిన పలు మినార్లు ధ్వంసమయ్యాయి. 1936లో వివాదాస్పద స్థలం ఎవరిదో తేల్చేందుకు వక్ఫ్ బోర్డు కమిషనర్ విచారణ చేపట్టారు. అయితే.. 1528లో బాబర్ ఈ మసీదు నిర్మాణం చేపట్టినట్లు విచారణలో తేలింది.
ఇదిలా ఉండగా.. 1949 డిసెంబర్ 22న రాత్రి మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించడంతో దాదాపు వారం రోజులపాటు హిందువులు అక్కడ పూజలు చేపట్టారు. అయితే.. మసీదులో కావాలనే విగ్రహం ఉంచారని ఆరోపించడంతో మరోసారి వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి.. బాబ్రీ మసీదు ప్రాంగణానికి తాళం వేశారు.
రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని గోపాల్ సిమ్లా విహరాద్, పరమహంస రామచంద్రదాస్ 1950 జనవరి 6న ఫైజాబాద్ కోర్టులో దావా వేశారు. 1951 మార్చి 3న పూజలు చేసేందుకు అనుమతించిన న్యాయస్థానం.. మసీదు లోపలి ప్రాంగణం గేట్లను మాత్రం మూసే ఉంచాలని ఆదేశించింది. ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును 1955లో అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది.
వివాదాస్పద స్థలం స్వాధీనానికి అనుమతించాలని 1959 డిసెంబర్ 17న నిర్మోహి అఖాడా సంస్థ దావా వేసింది. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే.. 1961 డిసెంబర్ 18న యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు మరో దావా వేసింది. మసీదు నుంచి రాముడి విగ్రహాలు తొలగించి.. స్థలాన్ని అప్పగించాలని కోరింది.
ఈ క్రమంలోనే 1964 ఆగస్టు 29న ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్.. 1984లో రాజ జన్మభూమి ఉద్యమం కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని ప్రచార సారథిగా నియమించింది. మరోవైపు.. బాబ్రీ మసీదుకు వేసిన తాళాలు తెరిచి.. హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతించాలని 1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్ కోర్టు తీర్పునివ్వడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన ముస్లింలు.. 1986 ఫిబ్రవరి 6న బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే 1989 ఫిబ్రవరి 1న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వీహెచ్‌పీ ప్రణాళిక ప్రకటించింది. ఆ ఏడాది నవంబర్‌లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించి.. నమూనా కూడా విడుదల చేసింది. 1989 జూన్ 8న రామ జన్మభూమి ఉద్యమంలో వీహెచ్‌పీతో పాటు భాగస్వామ్యం అవుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.
1989లో రామ జన్మభూమికి సంబంధించిన అన్ని పిటిషన్లు అలహాబాద్ కోర్టుకు బదిలీ కాగా.. అందులో నిర్మోని అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులను ప్రతివాదులుగా పేర్కొంటూ రామ్‌లల్లా విరాజ్‌మాన్ పేరిట జూలై 1న మరో పిటిషన్ దాఖలైంది. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అనుమతినివ్వడంతో అదే ఏడాది నవంబర్ 9న అయోధ్యలోని సింగ్‌ద్వార్‌లో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ క్రమంలోనే రామాలయ ఉద్యమానికి మద్దతు కోరుతూ 1990 సెప్టెంబర్ 15న రథయాత్ర ప్రారంభించారు బీజేపీ నేతల ఎల్‌కే అద్వానీ. రథయాత్ర నేపథ్యంలో మత ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీంతో అప్పటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన ప్రధాని.. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
1993 జనవరి 7న అయోధ్యలోని 67.7 ఎకరాల వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకుంటూ అప్పటి ప్రధాని పీవీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత అలహాబాద్ కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. అయితే.. ప్రభుత్వం అయోధ్య స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. ఏదైనా ప్రముఖ్యత ఉంటే తప్ప మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదని తేల్చిచెప్పింది.
అయితే 2002 ఏప్రిల్‌లో ఈ వివాదానికి సంబంధించిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ సర్వే నిర్వహించి.. అయోధ్యలో పదో శతాబ్దం నాటి హిందూ దేవాలయ అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు.. వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజించింది. రామ్‌లల్లా విరాజ్‌మాన్, ఇస్లామిక్ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారాకు కేటాయించింది.
Also Read: అలంకారంతో మెరిసిపోయిన రాముడు.. ప్రతి ఆభరణానికి ఒక్కో విశిష్టత.. ఏంటో తెలుసా?
అయితే.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 2010 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టేటస్ కో విధించింది. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ అనంతరం.. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదాస్పద భూమిలో 2.77 ఎకరాలు రామ జన్మభూమి మందిర నిర్మాణం కోసం ట్రస్టుకు బదిలీ చేసింది. ఇదే సమయంలో మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read: బాలరాముడి దర్శనం, హారతి పాస్‌లకు ఆన్‌లైన్ బుకింగ్ ఇలా చేసుకోండి.. పదేళ్లలోపు వారికి అయితే..
సుప్రీంకోర్టు తీర్పు రావడంతో 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా 2024 జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కోట్లాది మంది భక్తుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆనాడు.. 1528లో బాబర్ హయాంలో కూలిపోయిన రాముని ఆలయం.. ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది.