Water Ambulance: పడవను అంబులెన్స్ గా మార్చేసిన యువకుడు..దాల్ సరస్సులో కరోనా బాధితులకు సేవలు..

Water Ambulance: పడవను అంబులెన్స్ గా మార్చేసిన యువకుడు..దాల్ సరస్సులో కరోనా బాధితులకు సేవలు..

Covid Inspiration Yong Man..water Ambulance In Dal Lake (1)

Updated On : May 12, 2021 / 11:52 AM IST

Covid Inspiration boatman..Water Ambulance In Dal Lake : ఈ కరోనా కష్టంలో ఎంతోమంది తమ పెద్ద మనస్సుని చాటుకుని కరోనా బాధితులకు తమవంతు సహాయం చేస్తున్నారు. నిరుపేదలు కూడా సేవలో తామున్నామంటున్నారు. ఉపాధిగా ఉన్న ఓకే ఒక్క ఆటోను కూడా అంబులెన్స్ గా మార్చి సేవలందిస్తున్న పెద్ద మనస్సున్న మానవతా మూర్తుల గురించి విన్నాం. కానీ కాశ్మీర్‌లో ఓ యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తున్నాడు.

కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసించే తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడి పెద్ద మనస్సుకు అందరూ జేజేలు పలుకుతున్నారు. ఈమధ్యే కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. చక్కగా కోలుకున్నాడు. తనకు కరోనా సోకినప్పుడు కష్టం ఎలా ఉంటుందో..ఆ బాధ ఎలా ఉంటుందో తారిక్ కు తెలిసింది. ఈ కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా తెలిశాయి. అంతే… తనవంతుగా ఏమన్నా చేయగలిగితే బాగుండు అనుకున్నాడు. ఏం చేయాలా? అని ఆలోచించాడు.

తనకున్న పడవను అంబులెన్సుగా మార్చేసి బాధితులకు సేవ చేయాలనుకుని నిర్ణయించుకున్నాడు. అంతే దాల్ సరస్సులో టూరిస్టులను తిప్పి ఆ డబ్బులతో జీవించే తారిక్ తన పడవను అంబులెన్స్ గా మార్చేశాడు. కరోనా పేషెంట్లను తన పడవలో తీసుకెళ్తున్నాడు..అంతేకాదు వారికి ఏం కావాలో తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చి ఏం సహాయం కావాలన్నా తన శక్తి మేరకు చేసి పెడతానని వారిలో బాధితులకు..వారి బంధువులకు భరోసా కల్పిస్తున్నాడు తారిక్.

తన పడవనే అంబులెన్సుగా మార్చలనుకున్న తారిక్ ఓ సాధారణ వ్యక్తి. పడవను అంబులెన్స్ గా మార్చాలంటే కొంత డబ్బు కావాలి. రూపాయి రూపాయి కూడబెట్టాడు. కొంత అప్పు చేశాడు. అలా బాధితులకు సేవ చేయటానికి తారిక్ పడిన కష్టానికి ఏప్రిల్‌లో ఓ రూపు వచ్చింది. దాల్ సరస్సులో తేలియాడే పడవ కాస్తా అంబులెన్స్ గా మారిపోయింది. వాటర్ అంబులెన్స్ రెడీ అయ్యింది.

తారిక్ పడవ అంబులెన్స్ లో పీపీఈ కిట్స్ ఉన్నాయి. స్ట్రెచర్స్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఉంది. దీంతో కరోనా పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికైంది. తారిక్ కి కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ బోట్ ఎక్కనివ్వలేదు. కారణం కరోనా భయం. అప్పట్లో తారిక్ పట్లూ… 20 రోజులు ఇంట్లో క్వారంటైన్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది… ప్రతిసారీ అదే సమస్య వచ్చేది. ఎవ్వరూ తనను పడవ ఎక్కనిచ్చేవారు కాదు. తనలాంటి బోట్ నడిపేవారే తనను ఎక్కించుకోవడానికి భయపడటం చూసి… పట్లూ పడేవాడు. కానీ పరిస్థితి అలా ఉంది ఎవరు మాత్రం ఏం చేయగలరు వారికి కూడా కుటుంబం ఉంటుందిగా..అని అర్థం చేసుకున్నాడు. తనలాగా ఇంకెవరికీ అవ్వకూడదనే తన పడవను అంబులెన్స్ గా మార్చి బాధితులకు తనవంతు సహాయం చేస్తున్నాడు.

కాగా..శ్రీనగర్‌కి టూరిస్టులు పెద్ద సంఖ్యలో రావడంతో… అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న తులిప్ గార్డెన్ ఓపెన్ చేశాక మరింతగా పెరిగారు. దాంతో… కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఓ రోజు 131 నమోదయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లో కూడా ఇప్పుడు కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. మొన్న 3614 కొత్త కేసులు రాగా… 56 మంది చనిపోయారు.