Indian Army Soldier Missing: కుల్గామ్ నుంచి తప్పిపోయిన ఆర్మీ జవాన్ దొరికేశాడు.. ఆర్మీ, పోలీస్ అధికారులు ఏం చేశారంటే?
కుల్గామ్‌లోని అస్తల్ గ్రామంలో నివాసం ఉంటున్న 28ఏళ్ల జావేద్ అహ్మద్ వానీ తన గ్రామానికి చెందిన మరో ఆరుగురు యువకులతో కలిసి 2013లో భారత్ సైన్యంలో చేరాడు.

Javed Ahmad Wani
Javed Ahmad Wani : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir ) లోని కుల్గామ్ జిల్లా (Kulgam district) లో అదృశ్యమైన భారత ఆర్మీ జవాన్ జావేద్ అహ్మద్ వనీ (Javed Ahmad Wani) ని గురువారం పోలీసు బృందం గుర్తించారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు (Kashmir zone police) ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే, జవాన్ జావేద్ అహ్మద్‌ను వైద్య పరీక్షల అనంతరం విచారణ చేస్తామని ఏడీజీపీ కశ్మీర్ (ADGP Kashmir) తెలిపారు. ఈ విచారణలో ఆర్మీ, పోలీసు అధికారులు జావేద్ ఎటు వెళ్లాడు..? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలేం జరిగింది అనే విషయాలపై ఆరా తీయనున్నారు.
Kashmir Soldier: సెలవుపై ఇంటికొచ్చిన సైనికుడు అదృశ్యం.. వాహనంపై రక్తపు మరకలు.. ఉగ్రచర్యగా అనుమానం..
జావేద్ అహ్మద్ వనీది కుల్గాం జిల్లాలోని అస్థాల్ గ్రామం. అతను ఆర్మీలో పనిచేస్తుంటాడు. సెలవుల నిమిత్తం తన సొంత గ్రామానికి వచ్చాడు. గత నెల 29న సాయంత్రం బయటకు వెళ్లిన జావేద్ రాత్రి 9గంటల సమయం వరకు రాలేదు. దీంతో బయటకు వెళ్లిన కొడుకు ఎంతకీ రాకపోవటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా కిడ్నాప్ అయినట్లు గుర్తించారు. అతని కారును మార్కెట్ సమీపంలో గుర్తించారు. దానికి రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో తన కుమారుడిని కిడ్నాప్ చేసి ఉంటారని జావేద్ కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆర్మీ బృందం, పోలీసులు జావేద్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో సంచలనంగా మారింది. అయితే, గురువారం సాయంత్రం జావేద్‌ను పోలీసులు గుర్తించారు. అతన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం అసలేం జరిగింది. ఎటు వెళ్లాడనే విషయాలపై ఆర్మీ సిబ్బంది, పోలీసులు విచారణ చేయనున్నారు.
#Missing Army jawan has been recovered by Kulgam Police. Joint #interrogation will start shortly after medical checkup. Further details shall follow: ADGP Kashmir@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 3, 2023
కుల్గామ్‌లోని అస్తల్ గ్రామంలో నివాసం ఉంటున్న 28ఏళ్ల జావేద్ అహ్మద్ వనీ తన గ్రామానికి చెందిన మరో ఆరుగురు యువకులతో కలిసి 2013లో భారత్ సైన్యంలో చేరాడు. జావేద్ శారీరక, వ్రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2014లో జమ్మూ, కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ (JAKLI) రెజిమెంట్‌లోని 3వ బెటాలియన్‌లో నియమించబడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జావేద్ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడు. జావేద్ చిన్నతనం నుంచి తోటివారికి సహాయం చేసే స్వభావం కలిగిన వ్యక్తి అని స్థానికులు చెప్పారు. అతను కనిపించకుండా పోవడానికి రెండురోజుల ముందు సమీప గ్రామంలోని ఓ రోగికి రక్తదానంసైతం చేశాడు.