కేరళ సీఎం పినరయి విజయన్ నామినేషన్ దాఖలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర్మదామ్​ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్​ నామినేషన్​ దాఖలు చేశారు. కన్నూర్​ కలెక్టర్​ కార్యాలయంలో సీఎం నామినేషన్​ ప్రక్రియను పూర్తి చేశారు.

kerala polls కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర్మదామ్​ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్​ నామినేషన్​ దాఖలు చేశారు. కన్నూర్​ కలెక్టర్​ కార్యాలయంలో సీఎం నామినేషన్​ ప్రక్రియను పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కన్నూర్​ కలెక్టర్​ కార్యాలయానికి చేరుకున్న విజయన్​.. చేతులకు గ్లవ్స్​, ముఖానికి మాస్క్​తో పాటు ఫేస్​షీల్డ్​ని ధరించారు. విజయన్ వెంట కన్నూర్​ జిల్లా సీపీఎం కార్యదర్శి ఎంవీ జయరాజన్​ ఉన్నారు. దర్మధామ్​ నియోజకవర్గం నుంచి విజయన్ పోటీ చేయడం ఇది రెండోసారి.

ఇక, గత ఎన్నికల్లో సీపీఎం.. 92 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 85 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. కూట‌మి అభ్య‌ర్థుల కోసమే ఈసారి సీపీఎం ఏడు సీట్ల‌ను వ‌దులుకుంది. అందులో అయిదు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. మరోవైపు, ఇటీవల సీపీఎం పార్టీ ప్రవేశపెట్టిన “టూ-టర్మ్( రెండు, అంతకంటే ఎక్కువసార్లు పోటీచేసిన వారికి ఈసారి అవకాశం లేదు)” నిబంధనల వల్ల ఐదుగురు కేబినెట్ మంత్రులు,33మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ లభించలేదు.

140అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కేరళలో ఏప్రిల్​ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ తాజాగా చేపట్టిన ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91 స్థానాల్లో గెలుపొందిన ఎల్డీఎఫ్‌ కూటమి.. ఈసారి 82సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక, 2016 ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి ఈసారి కొద్దిమేరకు పుంజుకొని 56 సీట్లను సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కేరళలో సీఎం అభ్యర్థిని సైతం ప్రకటించిన బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడదని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే చెబుతోంది. గతంలో గెలిచిన ఒక్క స్థానానికే బీజేపీ పరిమితమవుతుందని సర్వే పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు