బీజేపీలో చేరిన కేరళ మాజీ డీజీపీ

బీజేపీలో చేరిన కేరళ మాజీ డీజీపీ

Updated On : February 6, 2021 / 6:43 AM IST

Kerala ex-DGP కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీలో చేరారు. మరికొద్ది నెలల్లో కేరళలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో థెకిన్‌కాడ్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు జాకబ్ థామస్.

అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అవినీతిమయంగా తయారయ్యాయని..అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికే తాను బీజేపీలో చేరినట్లు జాకబ్‌ థామస్‌ చెప్పారు. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ అవినీతిలో మునిగిపోయాయని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేది పార్టీ నిర్ణయిస్తుందని, అధిష్ఠానం ఆదేశాలతో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం అని జాకబ్‌ థామస్‌ తెలిపారు.

కాగా, ఐపిఎస్ అధికారిగా తన కెరీర్లో కేరళలో రాజకీయ పార్టీలపై వ్యాఖ్యలు చేసినందుకు జాకబ్ థామస్ రెండు సస్పెన్షన్లను ఎదుర్కొన్నాడు. ఓఖీ తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించినందుకు 2017 డిసెంబర్‌లో తొలిసారిగా సస్పెండ్ అయ్యారు. తిరిగి ఉద్యోగంలోకి వచ్చిన అనంతరం తన ఆత్మకథ ‘శ్రావుకల్కోప్పం నీన్తుంబోల్’ (షార్కులతో ఈత) ను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రచురించినందుకు 2018 ఏప్రిల్‌లో రెండవసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.

కేరళ ప్రభుత్వంతో తన గొడవ గురించి ప్రస్తావిస్తూ.. సొరచేపలతో ఈదుతున్నప్పుడు శిక్షకు గురయ్యానని..ఇప్పుడు నేను ప్రజలతో ఈత కొట్టేందుకు సిద్ధమయ్యాను అని జాకబ్ థామస్ వ్యాఖ్యానించారు. డీజీపీగా రిటైర్మెంట్‌ తీసుకోవడానికి ముందు జాకబ్‌ థామస్‌ను కేరళ ప్రభుత్వం మెటల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది.