Emergency Room Of Private Hospital Turns Wedding Venue In Kerala
Wedding emergency ward : పెండ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. దీంతో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా కల్యాణ మండపాల్లో బంధువులు, స్నేహితుల సమక్షంలో బాజాభజంత్రీల మధ్య జరుపుకుంటారు. ఇదే తరహాలో ఓ జంట తమ వివాహాన్ని జరుపుకునేందుకు సిద్ధమైంది. వరుడు, వధువు కుటుంబాల వారు పెండ్లి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో పెండ్లి ముహూర్తం ఉంది. ఉదయం పెళ్లికుమార్తె అలంకరణ కోసం వేరే ప్రాంతానికి కారులో వెళ్తుంది. ఈ క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
పెండ్లి కుమార్తె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెపూసకు బలమైన గాయం కావడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. అయితే, ఇరు కుటుంబాల సభ్యులు ముందుగానే నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం.. వరుడు, వధువుకు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోనే వివాహం జరిపించారు. ఎమర్జెన్సీ వార్డులోని బెడ్ పై పడుకొనిఉన్న వధువు నుదిటిపై వరుడు బొట్టుపెట్టి.. తాళి కట్టాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Also Read: Ys Jagan: ఇలా అయితే కష్టమే..! తప్పుకోండి..! పార్టీ నేతలపై జగన్ సీరియస్..! కారణం అదేనా..
కేరళ రాష్ట్రం అలప్పజలోని కొమ్మడికి చెందిన అవని, తంబోలికి చెందిన వి.ఎం.షారన్‌ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం తంబలోలిలో జరగాల్సి ఉంది. అయితే, ఉదయాన్నే పెళ్లి కూతురు అవని అలంకరణ కోసం కుమరకోమ్ వెళ్తుండగా.. కారు ప్రమాదానికి గురై ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం కొట్టాయం వైద్యకళాశాలకు తరలించారు. అవని వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో ప్రత్యేక చికిత్సకోసం మధ్యాహ్నం ఎర్నాకుళంలోని వీపీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవార్త విన్న షారన్, అతడి కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి చేరుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య పెళ్లికి శుభముహూర్తం ఉంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు చర్చించుకొని ఆ సమయంలోనే షారన్, అవనిలకు వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న అవని మెడలో తాళి కట్టేందుకు వరుడు సిద్ధమయ్యాడు. వైద్యులకు ఈ విషయాన్ని తెలపగా వారు ముందు అందుకు ఒప్పుకోలేదు. తరువాత ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వధువు అవనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెళ్లి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వరుడు వి.ఎం.షారన్ వధువు అవని నుదుటిపై బొట్టుపెట్టి.. మెడలో మూడుముళ్లు వేసి తన జీవిత భాగస్వామిగా స్వీకరించాడు.
అయితే, వధువు అవని వెన్నెముకకు గాయమైందని, త్వరలోనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.