వీళ్లేం పోలీసులు : తండ్రిని భుజాలపై మోసుకుంటూ…

  • Publish Date - April 16, 2020 / 10:02 AM IST

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది.  కారణం లేకుండా అనవసరం గా రోడ్లపైకి వచ్చిన వారి పట్ల పోలీసులు కొన్నిచోట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల ఓవరాక్షన్ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 
 

కేరళలో పోలీసులు ఇలాంటి ఓవరాక్షన్ చేస్తే  మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. కేరళలోని  కులాత్ పుజ్హకు చెందిన వృధ్దుడు  అనారోగ్యానికి గురై పునలూర్ ఆస్పత్రిలో చేరాడు.  ఆయన అక్కడ చికిత్స పొంది  కోలుకోవటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బయలు దేరారు.  మార్గ మధ్యంలో పునలూర్ దాటగానే పోలీసులు ఆటోను ఆపి …అందరినీ ఆటోలోంచి దింపి…ఆటోను వెనక్కి పంపించారు.  

ఆస్పత్రి రికార్డులు చూపించినా పోలీసులు ససేమిరా అన్నారు. పోలీసులు  నడిరోడ్డుమీద అర్ధంతరంగా దింపేయటంతో వారికి ఏంచేయాలో దిక్కుతోచని పరిస్ధితి అయ్యింది. చేసేదేమి లేక పెద్దాయన కొడుకు తన తండ్రిని  భుజాలపై మోసుకుని బయలు దేరగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన లగేజిని తల్లి మోసుకుంటూ కొడుకును అనుసరించింది. ఈ లోగా రోడ్డుపై  వెళుతున్న ఒక వ్యక్తి ఆ పెద్దావిడిచేతిలోని సంచిని తాను తీసుకుని వారికి సాయం చేశాడు. 

అలాగే తండ్ర్రిని మోసుకుంటూ  కాలినడకన  దాదాపు కిలో మీటరు దూరం ప్రయాణించి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావటంతో కేరళ మానవ హక్కుల కమీషన్ స్పందించింది. వృధ్దుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పట్టింది.  ఈసంఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది.  పోలీసులపై చర్యలకు సిధ్దమవుతున్నట్లు తెలిసింది. 

 

Also Read |  ఎస్ బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్