ట్రైనీ వైద్యురాలి హత్యోదంతం.. పోస్ట్‌మార్టం రిపోర్టులో విస్మయక వాస్తవాలు

వైద్యులు దేవాలయంలా భావించే ఆస్పత్రిలోనే యువ వైద్యురాలిని అమానవీయంగా బలిగొనడంతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ట్రైనీ డాక్టర్‌ను చెరబట్టి కిరాతంగా ప్రాణాలు తీశారని పోస్ట్‌మార్టం రిపోర్టులో రివీలయింది.

kolkata doctor case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌క‌తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై గత 11 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్జీ కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ను అత్యంత దారుణంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని దేశమంతా ముక్తకంఠంతో నినదిస్తోంది. అటు సుప్రీంకోర్టులోనూ ఈ హత్యోదంతంపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రైనీ వైద్యురాలి హత్యోదంతంలో విస్మయకర వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులోని అంశాలను నేషనల్ మీడియా వెల్లడించడంతో భయంకర నిజాలు బయటపడ్డాయి.

దారుణంగా హింసించి..
యువ వైద్యురాలిని చెరబట్టి కిరాతంగా ప్రాణాలు తీశారని పోస్ట్‌మార్టం రిపోర్టులో రివీలయింది. బాధితురాలిని దారుణంగా హింసించి చంపారని, ఆమె శరీమంతా గాయాలున్నాయని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ముఖం, మెడ, రెండు చెంపలపై గాయాలున్నాయని తెలిపింది. ముఖమంతా గీసుకుపోయి.. పెదవి మధ్యలో గాయమైంది. మెడ ముందు భాగంలో కొరికిన గుర్తులతో పాటు, రెండు పెదవుల లోపలి భాగంలోనూ గాయలయ్యాయి. రెండు కళ్లు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోవడంతో పాటు చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయని పోస్ట్‌మార్టం రిపోర్టులో పేర్కొన్నారు.

ద్వేషంతోనే దారుణం..
మృతురాలిపై శరీరంపై గాయాలను బట్టి చూస్తే ఆమెపై ద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు కనబడుతోందని కోల్‌క‌తా డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. మృతురాలి ముఖంపై గాయాలను పరిశీలిస్తే ఆమెను బాగా కొట్టినట్టు తెలుస్తోంది. కళ్లు, మెడ భాగానికి మధ్యలో చాలా ఎక్కువ గాయాలున్నాయి. ఎడమ కాలు దారుణంగా దెబ్బతిందని తెలిపారు. అయితే బాధితురాలు చనిపోవడానికి ముందు రేప్ జరిగిందా, చనిపోయిన తర్వాత హత్యాచారానికి పాల్పడ్డారా అనే దానిపై క్లారిటీ లేదన్నారు.

బలపడ్డ గ్యాంగ్ రేప్ అనుమానాలు!
అయితే బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ బలం చేకూర్చింది. ప్రధాన నిందితుడు పోలీస్ వలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉంచొచ్చని మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మృతురాలి శరీరంపై చాలా గాయాలున్నాయని, ఒక వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడని.. ఇది ముమ్మాటికీ గ్యాంగ్ రేప్ అని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సువర్ణ గోస్వామి ఆరోపించారు. అయితే సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌లో మృతురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

కాగా, తన కూతురిపై జరిగిన హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆర్జీ కర్ ఆస్పత్రి పెద్దలు ప్రయత్నించారని మృతురాలి తండ్రి ఆరోపించారు. తన కూతురిని దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన వేడుకున్నారు. అటు, సుప్రీంకోర్టు కూడా బెంగాల్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. ఇంత తీవ్రమైన కేసులో బెంగాల్ సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరించిందని మండిపడింది. సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం దేశవ్యాప్త ప్రోటోకాల్ రూపొందించేందుకు వైద్య ప్రముఖులతో కూడిన టాస్క్‌ఫోర్క్‌ ఏర్పాటు చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు విజ్ఞప్తితో ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలు విరమించారు.

ట్రెండింగ్ వార్తలు