Lancet Sensational Report On Corona Side Effects
Lancet sensational report on corona : రానున్న రోజుల్లో భారత్‌లో కరోనా మరింత కల్లోలం సృష్టించనుందా? కరోనా దుష్పరిణామాలపై లాన్సెట్ సంచలన నివేదిక వెల్లడించింది. భారత్‌లో కరోనా రెండోవేవ్ మరణ మృదంగం మోగించనుందని తెలిపింది. రానున్న రోజుల్లో ప్రతిరోజు 1,750 మంది కరోనాతో మరణిస్తారని పేర్కొంది. జూన్ మొదటి వారానికి ఈ సంఖ్య 2,320కి చేరుకునే అవకాశం ఉందని లాన్సెట్ అంచనా వేసింది.
లాన్సెట్ నివేదిక ప్రకారం 2020 ఆగస్ట్-సెప్టెంబర్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. 75 శాతం కేసులు 60 నుంచి 100 జిల్లాలలో వెలుగు చూశాయి. ఈసారి మాత్రం 20 నుంచి 40 జిల్లాలలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మొదటి వేవ్‌తో పోలిస్తే ఈసారి వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోందని నివేదిక తెలిపింది.
కేసుల సంఖ్య 10 వేల నుంచి 80 వేలకు చేరుకునేందుకు ఇంతకు ముందు 83 రోజులు పట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 40 రోజుల్లోనే 80 వేలకు చేరుకుంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని లాన్సెట్ తెలిపింది.