Lok Sabha Speaker Om Birla Tests Positive For Covid 19 Admitted To Aiims
Lok Sabha Speaker దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది. రెండు రోజుల కిందటే ఓంబిర్లాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
శనివారం(మార్చి-20,2021) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు స్పీకర్ ఓంబిర్లా. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, శరీరంలోని అన్ని వ్యవస్థలూ సాధారణంగానే ఉన్నాయని ఆదివారం ఎయిమ్స్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.
కొద్దిరోజుల కిందటే స్పీకర్ ఓంబిర్లా.. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద పార్లమెంట్ హౌస్‌లో హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వెంట పలువురు లోక్‌సభ సభ్యులు, సిబ్బంది ఉన్నారు. ఇటీవలి కాలంలో ఓం బిర్లాను కలిసిన వారికి పరీక్షలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఓం బిర్లాను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించుకోవాలని ఎయిమ్స్ డాక్టర్లు సూచిస్తున్నారు.