Dwarka
సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయిందని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ నగర ఆనవాళ్ల కోసం ఇప్పటికే పలు పరిశోధనలు జరిగాయి. గుజరాత్‌లోని ద్వారక తీరంలో ఇప్పుడు భారత పురావస్తు శాఖ టీమ్ మళ్లీ అన్వేషణ ప్రారంభించింది.
ఐదుగురు డైవర్లు అరేబియా సముద్ర గర్భంలో అన్వేషిస్తున్నారు. దీన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటోంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఏఎస్‌ఐ అనుబంధ విభాగం అండర్‌వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఈ అన్వేషణ ప్రారంభించడం గమనార్హం.
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ ప్రొఫెసరల్ అలోక్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది. ఆయన టీమ్‌లో ముగ్గురు మహిళా ఆర్కియాలజిస్టులే ఉన్నారు. వారి పేర్లు అపరాజిత శర్మ, రాజ్‌కుమారి బర్బినా, పూనమ్ వింద్.
Also Read: బంగారం ధరలు పెరగడానికి టాప్-5 కారణాలు ఇవే.. ఇవి తెలుసుకుని కొనండి..
ద్వారక కృష్ణుడి కర్మభూమి అని హిందూ పురాణాల్లో చెబుతారు. ద్వారక హిందువుల ఏడు మోక్ష నగరాల్లో ఒకటి అని అంటారు. ద్వాపర యుగంలో జరాసంధుడు దాడులు చేస్తుండడంతో అతడి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కృష్ణుడు మధురను వీడతాడు.
అక్కడి నుంచి గోమతీ నదీ, అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి కృష్ణుడు వెళ్లి విశ్వకర్మ సాయంతో ఇక్కడే ద్వారక నగరాన్ని నిర్మిస్తాడు. చివరకు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువుల విశ్వాసం.
ద్వారకపై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి. 1930 దశకంలో హిరానంద్ శాస్త్రి పరిశోధనలు చేశారు. ఆ తర్వాత 1963లో జేఎం నానావతి, హెచ్‌డీ సంకాలియా సమక్షంలో ద్వారకలో తవ్వకాలు జరిపారు. 1969తో పాటు 1983-1990 మధ్య సముద్ర గర్భంలో కొన్ని వస్తువులను గుర్తించారు.
ద్వారక అవశేషాలు బయటపడ్డాయని అప్పుడు అన్నారు. 2005-07 మధ్య యూఏడబ్ల్యూ సమక్షంలో ద్వారకా నగరంపై శోధన జరగగా, ఆ సముద్ర గర్భంలో ఓ నగరానికి సంబంధించిన గొప్ప నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. ద్వారకకు 4 వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.
ఇప్పుడు ఆ పరిశోధనలను మళ్లీ షురూ చేశారు. సముద్ర గర్భంలో ఉన్నది కృష్ణుడి ద్వారక నగరమేనా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే ద్వారక గురించి గుర్తించిన పలు అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.