Gold Prices: బంగారం ధరలు పెరగడానికి టాప్-5 కారణాలు ఇవే.. ఇవి తెలుసుకుని కొనండి..
బంగారంపై పెట్టుబడులు పెట్టే ముందు పలు వివరాలు తెలుసుకోవాలి.

GOLD price
దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు భారీగా పెరిగాయి. దీంతో చాలా మంది పెట్టుబడుల కోసం పసిడివైపే చూస్తున్నారు. ఈ ఏడాది కూడా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఇవి తెలుసుకుంటే మంచిది. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయో చూద్దామా?
ప్రపంచ ఆర్థిక సంక్షోభం: గత సంవత్సరం అనుకున్నంతగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో లాభాలు రాకపోవడం వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఇజ్రాయెల్- ఇరాన్, రష్యా- ఉక్రెయిన్ సహా పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధాలు, పలు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు వంటి అంశాల వల్ల ఆర్థిక వృద్ధి పెరగడానికి ఛాన్స్ లేకుండాపోయింది. ఈ పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. దీంతో 2024లో బంగార రేట్లు ఆకాశాన్ని అంటాయి.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు: ప్రపంచంలోని అన్ని మెట్రో నగరాల్లో రెగ్యులర్‌గా వాడే వసువులపై ధరలు పెరిగినప్పుడు బంగారం విలువ కూడా పెరుగుతుంది. 2023వ సంవత్సరంతో పోల్చుకుంటే 2024లో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులు 2024వ సంవత్సరంలో వడ్డీరేట్లు లలో ఎలాంటి మార్పు లేకున్నా ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వలన బంగారం ధర పెరిగింది. అదే ఈ ఏడాది కొనసాగే అవకాశం ఉంది.
అమెరికా డాలర్ బలహీనత: ప్రపంచ వ్యాప్తంగా బలమైన కరెన్సీగా అమెరికా డాలర్ ఉండడం వల్ల అంతర్జాతీయ లావాదేవీలు డాలర్ కరెన్సీలోనే జరుగుతాయనే సంగతి తెలిసిందే. 2024లో డాలర్ పెరుగుదలలో అంత ప్రభావం లేకపోవడం వలన విదేశీ పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడం వలన బంగారం రేట్లు పెరిగాయి.
కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు: ఇటీవలి సంవత్సరాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు మార్కెట్‌కు అనుగుణంగా తమ నిధులను పెంచేందుకు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశాయి. దీనివల్ల బంగారం రేటు పెరిగిందని అలాగే 2025లో కూడా ఇదే ధోరణి కొనసాగుతూ బంగారం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.
మార్కెట్ ఊహాగానాలు: పెట్టుబడిదారులు వేసుకునే అంచనాలు, మార్కెట్ వార్తలు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. బంగారం ధర పెరుగుతుందని నమ్మకం ఏర్పడితే, కొనుగోలు మరింత పెరిగి ధరలు ఎగసిపడతాయి. పెట్టుబడిదారుల ఫైనాన్సియల్ స్టేటస్, బంగారం భవిష్యత్ ధర అంచనాలు, దేశాల్లో నెలకొనే అనిశ్చితి ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.