Dog Loyal: కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అంటారు. నమ్మకం, విశ్వాసం విషయానికి వస్తే మనిషికన్నా శునకమే బెటర్ అని చెబుతారు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా జరిగిన ఘటనతో అది మరోసారి రుజువైంది. ఓ కుక్క చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. కళ్ల వెంబడి కన్నీరు పెట్టిస్తోంది. ఆ శునకం చూపిన విశ్వాసానికి, ప్రేమకు అందరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.
తనను ఎంతో ప్రేమగా చూసుకున్న యజమాని కన్నుమూయగా.. అతడి పట్ల ఆ మూగజీవి చూపిన ప్రేమ అందరినీ కదిలిస్తోంది. భారీ హిమపాతంలో చిక్కుకుని యజమాని చనిపోగా.. పెంపుడు శునకం 3 రోజులు కాపలా కాసింది. అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలి. మనుషులు కూడా వెళ్లలేని పరిస్థితులు. అయినా ఆ కుక్క మాత్రం మృతదేహం వదిలి వెళ్లలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్ లో భర్మణి ఆలయం సమీపంలో పియూష్ (13), విక్సిత్ రానా అనే ఇద్దరు యువకులు జనవరి 23న ట్రెక్కింగ్ కోసం కుక్రు కాండా పర్వత ప్రాంతానికి వెళ్లారు. అకస్మాత్తుగా భారీ మంచు వర్షం కురవడంతో వారిద్దరూ తప్పిపోయారు. ఆ తర్వాత మంచులో చిక్కుకుపోయి తీవ్రమైన చలితో ఇద్దరూ చనిపోయారు. 3 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు స్పాట్ కి చేరుకున్నాయి. అక్కడ కనిపించిన దృశ్యం అందరి హృదయాలను కదిలించింది.
పియూష్ మృతదేహం మంచులో కూరుకుపోగా.. ఆ పక్కనే అతడి పెంపుడు శునకం కూర్చుని ఉంది. 3 రోజులుగా ఆ మూగజీవి ఆహారం లేకపోయినా అక్కడి నుంచి పక్కకు కదల్లేదు. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా తన యజమాని శరీరానికి కాపలా కాసింది. ప్రతికూల వాతావరణం నుంచి, అడవి జంతువుల నుంచి తన యజమాని మృతదేహానికి రక్షణ కల్పించింది.
రెస్క్యూ బృందం పియూష్ డెడ్ బాడీని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, తన యజమానికి హాని తలపెడుతున్నారనే భావనతో కుక్క వారి మీదకు వెళ్లింది. డెడ్ బాడీని టచ్ చేయనివ్వలేదు. కాసేపు వారు దాన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాము సాయం చేయడానికి వచ్చామనే భరోసాని దానికి కల్పించారు. అంతే, ఆ కుక్క పక్కకు తప్పుకుంది. ఈ ఘటన మనిషిపై కుక్కకి ఉండే విశ్వాస్వానికి, ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
Also Read: ఆ గ్రామంలో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారో.. అంతే సంగతి.. పెదరాయుడి తీర్పుకన్నా పవర్‌ఫుల్