ఆ గ్రామంలో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారో.. అంతే సంగతి.. పెదరాయుడి తీర్పుకన్నా పవర్‌ఫుల్
ఇటీవల ఆ గ్రామం నుంచి కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇతర అబ్బాయిలు, అమ్మాయిలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు గ్రామపెద్దలు చెబుతున్నారు.
Love Marriage (Representative Image- Image Credit To Original Source)
- ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే వెలివేత
- నిత్యావసరాలు అందకుండా చర్యలు
- సామాజిక బహిష్కరణను ఎదుర్కోవాల్సిందే
MP’s Ratlam district: పెదరాయుడి సినిమాలో వెలివేత సీన్లను చూశాం. తప్పులు చేసిన వారిని పెదరాయుడు వెలివేస్తుంటాడు. ఇటువంటి పద్ధతి ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలోని రత్నాం జిల్లాలోని ఓ గ్రామం ప్రేమ వివాహాలు చేసుకున్న యువతీయువకుల కుటుంబాలను కూడా వెలివేయాలని నిర్ణయం తీసుకుంది.
పిప్లోడా తాలూకా పంచేవా గ్రామంలో ఇటీవల జరిగిన ఓ సమావేశానికి పంచాయతీ సభ్యులు సహా 400-450 మంది గ్రామస్తులు హాజరయ్యారు. ప్రేమ వివాహాలు చేసుకుని పారిపోయిన అమ్మాయి, అబ్బాయి కుటుంబాలను బహిష్కరించాలని నిర్ణయించారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి ప్రేమ వివాహం చేసుకుని వచ్చిన దంపతులకు సాయం చేసినవారిపై కూడా ఇవే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Also Read: నిజమే “ది డిస్‌కాంబాబ్యులేటర్” రహస్య ఆయుధాన్ని వాడాం: ట్రంప్
ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీయువకులకు చెందిన 3 కుటుంబాలతో గ్రామం తక్షణమే అన్ని సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కుటుంబాలను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననివ్వబోమని, వేడుకలకు ఎవ్వరూ పిలవవద్దని గ్రామపెద్దలు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే, బహిష్కరించిన కుటుంబాల్లోని వారికి ఎవరైనా పని ఇస్తే.. వారికీ ఇదే శిక్ష వర్తిస్తుందని చెప్పారు. అలాంటి కుటుంబాలకు పాలు, నిత్యావసరాలు సరఫరా చేయొద్దని అన్నారు. బహిష్కరణ ఎదుర్కొంటున్న వారికి వ్యవసాయ భూమిని కౌలుకు ఇవ్వవద్దని, పూజారులు, క్షౌరం చేసేవారు సేవలు అందించవచ్చని చెప్పారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువత కుటుంబాలకే కాదు, వారికి సహాయం చేసిన కుటుంబాలకూ గ్రామం మొత్తం బహిష్కరణ విధిస్తుందని సమావేశం నిర్ణయించింది.
“బహిష్కరణ ఎదుర్కొంటున్న కుటుంబాలతో సంబంధాలు పెట్టుకున్నా, వ్యాపార లావాదేవీలు చేసినా, వారి ప్రేమ వివాహాలకు సాక్షులుగా ఉన్నా, అలాంటి కుటుంబాలపైనా అదే చర్యలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి ప్రేమ వివాహం చేసుకుని మా గ్రామానికి వచ్చి నివసించే దంపతులకు ఆశ్రయం ఇచ్చినవారికీ అదే బహిష్కరణ అమలు అవుతుంది” అని వివరించారు.
ఇటీవల ఆ గ్రామం నుంచి కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇతర అబ్బాయిలు, అమ్మాయిలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు గ్రామపెద్దలు చెబుతున్నారు.
ఈ విషయం అధికారులు, పోలీసుల వరకు వెళ్లింది. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి నిర్ణయాలు చట్టవిరుద్ధమని అన్నారు.
