శివసేన, NCPతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం శుక్రవారం (నవంబర్ 22)న ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శివసేన మాత్రం.. నవంబర్ నెలఖారుకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కూడా. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీ మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ముంబైలో శివసేనతో మరోసారి భేటీ అయ్యాక అసలు నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి నిధులను బాధిత రైతులకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పెట్టుబడులుకు బదులుగా ఆయా నిధులను రుణబాధిత రైతులకు మళ్లించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం (CMP) రూపొందించేందుకు శివసేన సిద్ధమవు తుండగా.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం రుణమాఫీలపైనే ప్రధాన దృష్టిపెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మాణం వ్యయంలో మహారాష్ట్ర షేరు 25శాతాన్ని రైతులకు ఇవ్వాలని మూడు పార్టీలు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ బుల్లెట్ ప్రాజెక్ట్ వ్యయం రూ.1.08లక్షల కోట్లు. జపాన్ నుంచి పొందిన రుణాలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. 2023 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కాంగ్రెస్, శివసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.