గురువారం(అక్టోబర్-10,2019)మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్,ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని కాంగ్రెస్,ఎన్సీపీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలోని జాట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షా మాట్లాడుతూ…రాహుల్ గాంధీ, శరద్ పవార్ ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని సమర్థిస్తే సృష్టం చేయాలన్నారు. మహారాష్ట్రలో గత కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వాలు ఏ పని చేశాయో చెప్పాలని శరద్ పవార్‌ను షా కోరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో జాతీయ భద్రత చాలా పటిష్ఠమైందని అన్నారు. ఒక్క భారతీయ జవాన్ అమరుడైతే 10మంది శత్రువులను చంపేస్తామని ప్రపంచానికి తెలిసిందని షా అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులను ఈ సందర్భంగా షా ప్రస్తావించారు. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు అక్టోబర్-21,2019న ఎన్నికలు జరనున్నాయి. అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.