Farmer Crop Loss: రైతే రాజు అంటారు. దేశానికి వెన్నెముక అని చెబుతారు. ఈ డైలాగ్స్ వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం. అన్నదాతల దుస్థితి దయనీయంగా ఉంది. సాగులో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఓవైపు కరవు, మరోవైపు అతివృష్టి.. దీంతో సాగు చేయడం చాలా కష్టంగా మారింది. ఏదో ఒక కారణంతా ప్రతిసారీ పంట నష్టపోతున్నారు. అప్పుల పాలైపోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వాల నుంచి రైతులకు అందుతున్న సాయం అత్యంత దారుణంగా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇది నిజమే అని చెప్పేందుకు తాజాగా ఒక ఘటన జరిగింది. ఓ రైతు వరదల వల్ల పంట నష్టపోతే.. ప్రభుత్వం పరిహారంగా ఆ రైతుకి చేసిన సాయం ఎంతో తెలిసి అంతా షాక్ అవుతున్నారు. రెండు ఎకరాల్లో పంట నష్టపోతే ఆ రైతుకు ప్రభుత్వం నుంచి అందిన పరిహారం అక్షరాల ఆరు రూపాయలు.
మహారాష్ట్రలోని ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. పంట పోతే నష్టపరిహారంగా ఆయనకు ప్రభుత్వం ఇచ్చింది కేవలం 6 రూపాయలు. ఏంటి షాక్ అయ్యారు కదూ. కానీ, ఇది నిజం. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాకు చెందిన రైతుకి ఈ దారుణమైన అనుభవం ఎదురైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా తనకు కలిగిన పంట నష్టానికి ప్రభుత్వం నుండి కేవలం 6 రూపాయలు మాత్రమే పరిహారం అందిందని తెలిపి ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రైతు పేరు దిగంబర్ సుధాకర్ తంగ్డే. పైథాన్ తాలూకాలోని దావర్వాడి గ్రామంలో నివాసం ఉంటున్నారు. శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే మరాఠ్వాడ ప్రాంతంలో పర్యటన సందర్భంగా పైథాన్‌లోని నందర్ గ్రామంలో రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి అందిన పరిహారం విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల, రాష్ట్రంలోని అకోలా జిల్లాలోని కొన్ని గ్రామాల రైతులు భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయారు. పంట నష్టాలకు సంబంధించి కేంద్ర బీమా పథకం కింద వారికి పరిహారం అందింది. అయితే, అది చాలా తక్కువ మొత్తంలో ఉంది. 3 రూపాయలు, 21 రూపాయలు మాత్రమే పరిహారంగా పొందారు. ఇది తమకు అవమానకరమైనదిగా రైతులు వాపోయారు. ఇది తమను ఎగతాళి చేయడమే అని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద సాయం పొందిన రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, చెక్కుల ద్వారా మొత్తాలను తిరిగి ఇచ్చేశారు.
“నాకు 2 ఎకరాల భూమి ఉంది. పంట పోతే.. పరిహారంగా నా బ్యాంకు ఖాతాలో 6 రూపాయలు జమ అయ్యింది. ఇంత తక్కువ చెల్లించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ డబ్బు నాకు ఒక కప్పు టీ కొనడానికి కూడా సరిపోదు. ప్రభుత్వం రైతులతో పెద్ద జోక్ చేసింది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు” అని రైతు సుధాకర్ తంగ్డే వాపోయారు. ”గత రెండు నెలలుగా రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు, తీరా చూస్తే వచ్చింది ఇదీ.. వారంతా ఆ డబ్బుని తిప్పి పంపుతున్నారు” అని తంగ్డే చెప్పారు.
ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా మరాఠ్వాడ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో అన్నదాతలు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో బాధిత రైతులకు రూ.31,628 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. పంట నష్టాలు, నేల కోత, ఇళ్ళు, దుకాణాలు, పశువుల శాలలకు నష్టం మొదలైన వాటికి సంబంధించిన పరిహారం ఇందులో ఉంది.