మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) గుండెపోటుతో కన్నుమూశారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత

Manohar Joshi Maharashtra Former Chief Minister passes away

Manohar Joshi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయనను బుధవారం ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. జోషి అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో జరగనున్నాయి. మనోహర్ జోషికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన సతీమణి అనఘా మనోహర్ జోషి 2020లో మరణించారు.

కౌన్సిలర్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు..
మనోహర్ జోషి 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అవిభక్త శివసేన పార్టీ నుంచి మహారాష్ట్రలో అత్యున్నత పదవిని అధిష్టించిన మొదటి నాయకుడిగా ఆయన ఘనతకెక్కారు. పార్లమెంటు సభ్యునిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. 2002 నుంచి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని నంద్విలో 1937, డిసెంబరు 2న మనోహర్ జోషి జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ముంబైలో జరిగింది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన జోషి.. 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 40 సంవత్సరాలకు పైగా శివసేన పార్టీలో కొనసాగారు. మున్సిపల్ కౌన్సిలర్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. జోషి 1968-70లో ముంబయిలో మున్సిపల్ కౌన్సిలర్‌గా.. 1970లో స్టాండింగ్ కమిటీ (మునిసిపల్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా ఉన్నారు.

1972లో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మూడు సార్లు శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. 1990లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1990-91 కాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్- సెంట్రట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శివసేన టిక్కెట్‌పై విజయం సాధించారు.

Also Read: జయలలిత ఆభరణాలు తమిళనాడువే.. బెంగళూరు కోర్టు తాజా తీర్పు.. అసలేంటి కేసు?

కాగా, మనోహర్ జోషి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Also Read: ఎన్నికల వేళ ఇండియా కూటమికి బిగ్‌ రిలీఫ్.. కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం