Mlc Kavitha: కవిత అమెరికా నుంచి రాగానే.. మరో సంచలనం ఖాయమా? ఇంతకీ ఏం చేయబోతున్నారు?
ఏప్రిల్‌లో కేసీఆర్‌కు రాసిన లేఖతో సంచలనం క్రియేట్ చేసిన కవిత.. ఇప్పుడు బొగ్గు గని కార్మికులకు రాసిన లెటర్‌లో మరింత..(Mlc Kavitha)

Mlc Kavitha: కారు పార్టీలో కవిత ఎపిసోడ్ కు త్వరలోనే ఎండ్ కార్డు పడే అవకాశాలు కన్పిస్తున్నాయ్. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత వ్యవహారం.. పార్టీలో వివాదాలను పీక్స్‌కు చేర్చినట్లు డిస్కషన్ జరుగుతోంది. కవితపై చర్యలు తీసుకునేందుకు కారు పార్టీ రెడీ అవుతోందని టాక్. ఇక అటు కవిత కూడా తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారనే గుసగుస వినిపిస్తోంది. ఇంతకీ ఏం చేయబోతున్నారు.. కవిత అమెరికా నుంచి వచ్చాక.. ఈసారి మరో సంచలనం ఖాయమా.. కవిత ఎపిసోడ్‌కు ఎలాంటి ముగింపు రానుంది..
కవిత ఎపిసోడ్.. కారు పార్టీలో కాక పుట్టిస్తోంది. పార్టీలో వ్యక్తులను, ఫ్యామిలీ మెంబర్స్‌ను టార్గెట్ చేస్తూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. చూసీచూడనట్లుగా వదిలేద్దామని గులాబీ నేతలు అనుకున్నా కవిత మాత్రం డోస్ తగ్గించడం లేదు. తండ్రి కేసీఆర్‌కు గతంలో కవిత లేఖ రాయడం.. అది లీక్ కావడం.. బీఆర్ఎస్‌లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఆ లేఖలో తండ్రి వైఖరిని కవిత ప్రశ్నించడం.. పార్టీలో దెయ్యాలు ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం లాంటివి కొత్త చర్చకు దారి తీశాయ్. అంతేకాదు బీజేపీతో బీఆర్‌ఎస్ విలీన చర్చకు కవిత లేఖతో బీజం పడింది. ఆ ప్రకంపనలు ఇప్పటికీ గులాబీదళాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
వీటన్నింటినీ గులాబీదళం చూసీ చూడనట్లే వదిలేసింది. అయినా కవిత ఏమాత్రం తగ్గడం లేదు. సోదరుడు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాటల దాడి మొదలుపెట్టారు. దీంతో అటు కుటుంబంతో, ఇటు పార్టీతో కవితకు గ్యాప్ పెరుగుతూ వచ్చింది. వరుస పరిణామాలతో.. కవితను కేసీఆర్ కూడా దూరం పెట్టారనే గుసగుస వినిపించింది.
కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరం..
ఇంత జరిగినా.. జరుగుతున్నా.. కవిత మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. తెలంగాణ జాగృతి ద్వారా తన కార్యక్రమాలు చేస్తూ వెళ్లిపోతున్నారు. ఈ మధ్యలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి లిల్లీపుట్ లీడర్ అంటూ కవిత కామెంట్ చేయడం.. మరో నేత కార్తీక్ రెడ్డిని ఉద్దేశించి సైకో, చిన్న పిల్లాడు అంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. దీంతో కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. (Mlc Kavitha)
కవిత అమెరికాలో ఉండగానే.. పదవి నుంచి తొలగింపు..
కవిత వ్యవహారం రచ్చరేపుతున్న వేళ.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను పదవి నుంచి తొలగించింది బీఆర్ఎస్. కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా నియమించింది. దీనిపై కవిత తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో.. ఇలా పదవి నుంచి తప్పించి ఇతరులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు.. అమెరికా నుంచే కవిత బహిరంగ లేఖ రాశారు. తాను అమెరికా పర్యటనలో ఉండగా.. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తనను TBGKS నుంచి ఎలా తొలగిస్తారని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.(Mlc Kavitha)
హైదరాబాద్ వచ్చాక రాజకీయ సంచలనాలు ఖాయం..!
ఏప్రిల్‌లో కేసీఆర్‌కు రాసిన లేఖతో సంచలనం క్రియేట్ చేసిన కవిత.. ఇప్పుడు బొగ్గు గని కార్మికులకు రాసిన లెటర్‌లో మరింత రెచ్చిపోయారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. ఇప్పటికే కవిత అంశంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత.. హైదరాబాద్ వచ్చాక రాజకీయ సంచలనాలు చోటుచేసుకోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా?
రాజకీయ భవితవ్యంపై కవిత నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక అటు కవిత వ్యవహారంపై.. కుటుంబానికి, పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలు.. ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోందనే గుసగుస నడుస్తోంది. దీంతో పార్టీ చర్యలు తీసుకోవడానికి ముందే అమెరికా నుంచి రాగానే ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదనే టాక్ విన్పిస్తోంది.
Also Read: మార్వాడీ గోబ్యాక్ నినాదం వెనుక కారణం ఏంటి? మార్వాడీల వాదన ఏంటి? ఇద్దరి వెర్షన్ ఇదే..