Telangana Group-1 issue : గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం.. రీవాల్యుయేషన్ ప్రక్రియకు..
Telangana Group-1 issue : గ్రూప్-1 విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి కార్యాచరణలో భాగంగా టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Group-1 issue : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ (Telangana Group-1 issue) పరీక్షల జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు తీర్పుపై తదుపరి కార్యాచరణ కోసం గురువారం టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో వారం రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యుయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడింది. గ్రూప్-1 నియామకాల్లో లోపాలు లేవనే వాదనను స్ట్రాంగ్ గా వినిపించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. చివరి లీగల్ అవకాశమైన సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయని కమిషన్ అభిప్రాయ పడింది. మరోవైపు.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు కాపీపై టీజీపీఎస్సీ లీగల్ విభాగం గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తుంది. మరోవారం రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే.. మరోవైపు.. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై గ్రూప్-1 కు ఎంపికయిన అభ్యర్థులు కోర్టుకు వెళ్లే యోచనలు ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగింది..
2024 అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 21వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే, గ్రూప్-1 ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ.. వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు.. వాటిని రద్దు చేయొద్దంటూ మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇలా మొత్తం 12 పిటీషన్లు రాగా.. వీటిపై జులై7న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. అయితే, ఈనెల 9న పిటీషన్లపై హైకోర్టు తుది తీర్పును వెలువరించింది.
గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. రీవాల్యుయేషన్ కోసం టీజీపీఎస్సీకి హైకోర్టు ఎనిమిది నెలల డెడ్ లైన్ విధించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ నిర్వహించలేని పక్షంలో పరీక్షలను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తీర్పుకు సంబంధించి 222 పేజీల ఆర్డర్ కాపీలో హైకోర్టు టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.