జయలలిత ఆభరణాలు తమిళనాడువే.. బెంగళూరు కోర్టు తాజా తీర్పు.. అసలేంటి కేసు?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో కీలక తీర్పునిచ్చింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం.

జయలలిత ఆభరణాలు తమిళనాడువే.. బెంగళూరు కోర్టు తాజా తీర్పు.. అసలేంటి కేసు?

Jayalalithaa case chronology

Jayalalithaa case chronology: 14 ఏళ్లపాటు తమిళనాడు రాజకీయాలను శాసించడంతో పాటు.. దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత. కానీ.. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో దోషిగా తేలారు. అటు రాజకీయ విమర్శలు.. ఇటు కేసుల ఇబ్బందులకు తోడు అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసింది. ఈ క్రమంలోనే కన్నుమూసిన జయలలిత మరణం కూడా ఓ వివాదాస్పదంగానే మారింది.

జయలలిత జయరామం. 1948 ఫిబ్రవరి 24న కర్నాటకలోని ఓ సంప్రదాయ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. బెంగళూరులో చదువుతోపాటు పలు నృత్యరీతులను నేర్చుకున్న ఆమె.. కర్నాటక సంగీతాన్ని కూడా అభ్యసించారు. నటనపై ఉన్న మక్కువతో తొలుత నాటకాలు ప్రారంభించిన జయలలిత.. హీరోయిన్ స్థాయికి ఎదిగారు.

నాలుగు భాషలను అనర్గళంగా మాట్లాడలగిలిన ఆమె.. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. 1981లో అన్నాడీఎంకేలో చేరిన ఆమె.. 1984లో తొలిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమస్యలపై పోరాటం చేసే తత్వం, మంచి వాగ్ధాటి ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. తమిళనాడు సమస్యలపై పార్లమెంట్‌లో పలు సార్లు ఆమె గళమెత్తిన తీరుతో ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు జయ.

ఎంజీఆర్ వారసురాలు
ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత.. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. అతిచిన్న వయసులో సీఎం అయిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు జయలలిత. టాన్సీ భూముల కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో… 2001 ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. 2002లో ఆ కేసులో విడుదలైన జయలలిత.. ఆడింపట్టి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

74 రోజులపాటు మృత్యువుతో పోరాడి..
2011లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత.. 2014లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చడంతో మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే.. 2015లో ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన జయ.. తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 2016 ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి మే నెలలో సీఎం పీఠాన్ని అధిష్టించారు. కానీ.. అదే ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యానికి గురైన జయలలిత.. 74 రోజులపాటు మృత్యువుతో పోరాడారు. 2016 డిసెంబర్ 5న పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత.. ఆమె మృతి నుంచి వారసత్వం వరకు అన్నీ వివాదాస్పదమే అయ్యాయి.

అనర్హత వేటు
కన్నడ నాట జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జయలలిత.. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. కానీ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయమంలోనే లెక్కకు మించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలు కేసుల్లో దోషిగా తేలిన జయలలితపై అనర్హత వేటు కూడా పడింది. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమెకు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది.

27 కిలోల బంగారు వజ్రాభరణాలు..
జయలలిత 1991-96 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి అధికారులు చాలా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 కిలోల బంగారు వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటితోపాటు 740 ఖరీదైన చెప్పులు, 11 వేల 344 పట్టు చీరలు, 250 శాలువాలు, లెక్కు మించిన గృహోపకరణాలు, దాదాపు 2 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.

250 మంది సాక్షుల విచారణ
ఈ కేసులో 1996 డిసెబర్ 7న జయలలితను అరెస్ట్ చేయగా.. 1997లో సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. అయితే.. 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు.. అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

100 కోట్ల రూపాయల జరిమానా
దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను కర్నాటకకు బదిలీ చేశారు. 2014 సెప్టెంబర్‌లో జయలలిత అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన స్పెషల్ కోర్టు.. జయలలితతోపాటు ఆమె స్నేహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరణ్ను దోషులుగా తేల్చి నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. జయలలితకు 100 కోట్ల రూపాయలు, మిగతా ముగ్గురు ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో భారీగా జరిమానా విధించడంతో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును వేలం వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. RBI, SBI లేదా బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించి జరిమానా మొత్తాన్ని జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది.

బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
అయితే.. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన జయలలిత.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టేయడంతో.. 2014 అక్టోబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారామె. 2014 అక్టోబర్ 17న జయలలితకు బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలోనే 2015లో కర్నాటక హైకోర్టు జయలలితతో పాటు మిగతా ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. అప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం 2017లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నలుగురినీ దోషులుగా తేల్చింది.

6 పెద్ద ట్రంకు పెట్టెల్లో నగలు
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో కీలక తీర్పునిచ్చింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం. కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని కర్నాటక సర్కారును ఆదేశించింది. సదరు బంగారాన్ని తీసుకెళ్లేందుకు 6 పెద్ద ట్రంకు పెట్టెలు తీసుకొని భారీ భద్రతతో రావాలని న్యాయస్థానం సూచించింది. ఇక నగలు భద్రతపర్చడంతోపాటు, కేసు విచారణ జరిపినందుకు కర్నాటక ప్రభుత్వం ఖర్చు చేసిన 5 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కర్నాటకకు చెల్లించింది.

తమిళనాడుకే అప్పగింత
జయలలిత అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న 27 కిలోల బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు. ఈ కేసు విచారణ జరుపుతున్న న్యాయస్థానమే జయలలిత ఆస్తులను వేలం వేయాలని ఓ ఆర్టీఐ కార్యకర్త పిటిషన్ వేశారు. దాన్ని తోసిపుచ్చిన న్యాయస్థానం.. తమిళనాడు ప్రభుత్వానికే నగలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 6, 7 తేదీల్లో ఆభరణాలు తీసుకెళ్లేందుకు 6 భారీ ట్రంకు పెట్టెలు తీసుకొని రావాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఐజీపీ.. ఒక ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్‌ను వెంటబెట్టుకొని భారీ భద్రతతో ఈ ఆభరణాలను తీసుకెళ్లాలని పేర్కొంది.

Also Read: గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్.. షణ్ముఖ్ అన్న కోసం పోలీసులు వెళ్తే..

ఆభరణాలు అప్పగించేందుకు ప్రత్యేక అధికారిని నియమించిన న్యాయస్థానం.. తమిళనాడు అధికారులు ఆయనతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఇక.. ఆభరణాలు స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి.. కేసు విచారణను మార్చి 6కు వాయిదా వేశారు. మరోవైపు.. ఈ కేసు విచారణ, నగల భద్రత కోసం కర్నాటక ప్రభుత్వం ఖర్చు చేసిన 5 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం.. కర్నాటకకు డీడీ రూపంలో చెల్లించింది.

Also Read: విరుష్క జంట రెండో బిడ్డ ‘అకాయ్’ పేరుకు అర్థం ఏంటి? నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు!

వాటికి వేలం నుంచి మినహాయింపు
అయితే.. కర్నాటక ప్రభుత్వం అందజేసే 27 కిలోల బంగారు ఆభరణాల్లో 7 కిలోలు జయలలితకు ఆమె తల్లి నుంచి వారసత్వంగా వచ్చాయి. వాటిని వేలం నుంచి మినహాయించాలని గతంలో జయలలిత న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలోనే 20 కిలోల ఆభరణాలను విక్రయించి, వచ్చిన మొత్తంతో జరిమానా చెల్లించనున్నారు. ఇక కెన్‌ఫిన్‌ హోమ్స్‌ లిమిటెడ్‌లో జయలలిత ఖాతాలో ఉన్న 60 లక్షల రూపాయల నగదును ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే న్యాయస్థానంలో జమ చేశారు. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేసే కేసును ప్రత్యేక కోర్టు ఇంకా విచారిస్తూనే ఉంది. ఆభరణాల వేలం పూర్తయిన తర్వాత.. స్థిరాస్థులను వేలం ప్రక్రియను ప్రారంభిస్తారు.