మహా ట్విస్ట్ : సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ – ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు

  • Publish Date - November 23, 2019 / 03:46 AM IST

మహారాష్ట్రలో మహా ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్‌ను ఏర్పాటు చేస్తారని, ఉద్దవ్ ఠాక్రే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం రాత్రికి రాత్రి పరిణామాలు మారిపోయాయి. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని శివసేన కన్నకల్లలు కల్లలైపోయాయి. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. 

శివసేన – ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ..తెల్లారేసికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అమిత్ షా, మోడీలు తమ ప్రత్యేకత చాటుకున్నారు. గత రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి మోడీని పవార్ కలిసినప్పుడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. కానీ..శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు. రైతుల సమస్యలపైనే చర్చించామంటూ పవార్ చాణిక్యాన్ని ప్రదర్శించారు. 

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు..శివసేనకి 56 సీట్లు వచ్చాయి. విపక్ష కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్‌కి 44, ఎన్‌సిపికి 54 సీట్లు దక్కాయి. ఇప్పుడు అధికారం చేపట్టబోతోన్న శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపికి మెజార్టీకి అవసరమైన 145సీట్లకంటే ఎక్కువే ఉన్నాయ్. ఇతరులు 23 చోట్ల గెలుపొందినా వారి అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం ఇవన్నీ తలకిందులయ్యాయి. అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు విడుదల కాగా..అప్పట్నుంచే బిజెపి -శివసేన మధ్య మాటల యుధ్దం కొనసాగింది..చివరికి పొత్తు కాస్తా చీలిపోయింది. చివరకు ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
Read More : సుస్థిర పాలన కోసమే చేతులు కలిపాం : డిప్యూటీ సీఎం అజిత్ పవార్