గోవా ఎయిర్ పోర్ట్ లో తప్పిన పెద్ద ప్రమాదం

గోవా విమానాశ్రయంలో మంగళవారం(డిసెంబర్-17,2019)ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. నావల్ ఎయిర్ ట్రాఫిక్,రన్ వే కంట్రోలర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్ వెంటనే అప్రమత్తమవడంతో స్పైస్ జెట్ విమానం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.
మంగళవారం ఉదయం స్పైస్‌జెట్ విమానం SG3568 ల్యాండింగ్ కోసం గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి సందేశాలు పంపింది. రన్ వే కంట్రోలర్ రమేష్ తిగ్గా, లీడింగ్ ఎయిర్‌మెన్(ఎయిర్ హ్యాండ్లర్) ఆ విమానం సరైన రీతిలో ల్యాండింగ్ కావడం లేదని గమనించారు. ముందు భాగం కిందివైపుగా ల్యాండ్ అవుతుండటం చూశారు. రన్ వే కంట్రోలర్ వెంటనే ఏటీసీ టవర్‌లో విధుల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లెఫ్ట్‌నెంట్ క్యాడర్ హర్మీత్ కౌర్ కు సమాచారం అందించారు. ఆ విమానాన్ని ఇప్పుడు ల్యాండ్ చేయవద్దని, మరోసారి ప్రయత్నం చేసి ల్యాండింగ్ చేయాలని హర్మీత్ కౌర్ సూచించారు.
అయితే రెండోసారి కూడా ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో మరోసారి ప్రయత్నించాలని అధికారులు సూచనలు చేశారు. దీంతో మూడోసారి విజయవంతంగా విమానం ల్యాండ్ అయ్యింది. 8గంటల5నిమిషాల సమయంలో ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదమే జరిగివుండేది. ఎమర్జెన్సీ, సేఫ్టీ సిబ్బంది ఆ విమానంను తమ కంట్రోల్‌కి తీసుకున్నారని నేవీ ప్రతినిధి తెలిపానే. గోవా రాజధాని పనాజీకి 35కిలోమీటర్ల దూరంలోని వాస్కో లో ఉన్న గోవా ఎయిర్ పోర్ట్.. INS హన్స నావల్ ఎయిర్ బేస్ లో భాగమన్న విషయం తెలిసిందే.