asaduddin owaisi salms nitish kumar
Asauddin Owaisi slam nitish kumar: దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తోన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అహ్మదాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘బీజేపీతో కలిసి ఉన్న సమయంలోనూ నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్ల ఘటన జరిగిన సమయంలో కూడా ఆయన బీజేపీతో కలిసే ఉన్నారు. 2015లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మళ్ళీ 2017లో బీజేపీతో కలిశారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం కోసం నితీశ్ కుమార్ పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీని వీడారు. మమతా బెనర్జీ కూడా అప్పట్లో ఎన్డీఏలోనే ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను ఆమె ఆ సమయంలో పొగిడారు’’ అని విమర్శలు గుప్పించారు.
‘‘మేము మైనారిటీ కమ్యూనిటీల అభివృద్ధి, వారికి న్యాయం కోసం మాట్లాడుతుంటే మాకు వ్యతిరేకంగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. లౌకికవాదంలో నిపుణులం అని చెప్పుకుంటోన్న కొందరు చూపెడుతున్న తీరు ఇది. ఎవరు లౌకికవాదులో, ఎవరు మతతత్వవాదులో వారి తీరుతోనే తేలుతుంది. దేశం మొత్తం వారిని చూస్తోంది’’ అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కాగా, ఇప్పటికే నితీశ్ కుమార్ దేశంలోని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించారు.