షాకింగ్ ఘటన.. షాప్‌లో రూ.50 కోసం వేలిని కొరికేసిన కస్టమర్

Frock Shop: అక్కడితో ఆగకుండా అక్కడే ఉన్న దుకాణదారుడి కొడుకిని కూడా కొరికాడు కస్టమర్.

ఓ వస్త్రదుకాణదారుడితో రూ.50 కోసం గొడవ పడి అతడి చూపుడు వేలిని కొరికేశాడు కస్టమర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో చోటుచేసుకుంది. శివ చంద్ర కర్వారియాకు ఓ బట్టల దుకాణం ఉంది. ఒక కస్టమర్ తాజాగా ఆ దుకాణానికి వెళ్లి ఫ్రాక్ కొన్నాడు.

అయితే, ఆ తదుపరి రోజు అదే ఫ్రాక్ ను పట్టుకుని దుకాణానికి వచ్చి అది సైజులో చిన్నగా ఉందని, అది తీసుకుని పెద్ద సైజుది ఇవ్వాలని చెప్పాడు. దీంతో పెద్ద ఫ్రాక్ కోసం మరో రూ.50 చెల్లించాలని కస్టమర్‌కు దుకాణదారుడు చంద్ర కర్వారియా చెప్పాడు. తాను మరో రూ.50 చెల్లించబోమని కస్టమర్ అన్నాడు.

దీంతో గొడవ చెలరేగింది. కస్టమర్‌కు చిర్రెత్తుకొచ్చి ఆ దుకాణదారుడి ఎడమచేతి వేలిని కొరికేశాడు. అక్కడితో ఆగకుండా అక్కడే ఉన్న దుకాణదారుడి కొడుకిని కూడా కొరికాడు కస్టమర్. ఆ తర్వాత అక్కడ ఉన్న బట్టలను దుకాణదారుడిపైకి విసిరేసి, ఆ కస్టమర్ పారిపోయాడు. దుకాణదారుడు శివ చంద్ర పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు