Dangerous Car Stunts: రద్దీ రోడ్డుపై కారుతో డేంజరస్ స్టంట్స్ చేసిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. అతడికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. భారీగా జరిమానా విధించారు. దాదాపుగా 60వేల రూపాయల ఫైన్ విధించి అతడి తిక్క కుదిర్చారు. గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన జరిగింది.
ఓ వ్యక్తి మారుతీ సుజుకి బాలెనో కారులో అత్యంత ప్రమాదకర స్టంట్స్ ప్రదర్శించారు. ఆ రోడ్డు చాలా రద్దీగా ఉంది. అనేక వాహనాలు వెళ్తున్నాయి. ఇదేమీ పట్టించుకోని అతడు.. రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. అతివేగంగా వెళ్తూ సడెన్‌గా బ్రేక్ వేయడం.. కారును ఓ వైపునకు తిప్పడం వంటివి చేశాడు. అతడి పిచ్చి చేష్టలతో తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు అతగాడి చర్యలను తమ కెమెరాల్లో వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే..ఆ వీడియోలు వైరల్ గా మారాయి. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే నోయిడా ట్రాఫిక్ పోలీసులు చర్యలకు దిగారు. అతగాడికి ఏకంగా 57వేల 500 రూపాయలు ఫైన్ వేశారు.
నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటనను ధృవీకరించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డ్రైవర్‌పై నిబంధనల ప్రకారం చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ వీడియో రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ గురించి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. దీన్ని “ఖరీదైన స్టంట్” అని కొందరు పిలిచారు. మరికొందరు గ్రేటర్ నోయిడాలోని డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను క్రమం తప్పకుండా విస్మరిస్తున్నారని విమర్శించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్‌ను నిరోధించడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని చాలా మంది నొక్కి చెప్పారు. “అతని కారును కూడా సీజ్ చేసి ఉండాలి” అని ఓ నెటిజన్ అన్నాడు. “అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా 6 నెలల పాటు సస్పెండ్ చేయాలి” అని మరొకరు డిమాండ్ చేశారు.
A guy performed stunts with his car on
the streets of Greater Noida. 🚗💨
Noida Traffic Police took action and imposed a fine of ₹57,500.
Good Job, @Noidatraffic 👏👏 pic.twitter.com/Qn1nmGpmJj— Greater Noida West (@GreaterNoidaW) October 10, 2025