Man Locks Self: మూడేళ్లుగా ప్లాట్ లోనే ఒంటరిగా.. తాళం వేసుకుని లోపలే.. మానవ వ్యర్థాలతో నిండిపోయిన గది.. ముంబైలో ఘోరం

నాయర్ తన గదిలోని కుర్చీపై మాత్రమే పడుకుంటాడని చూసి మేము షాక్ అయ్యాము. ఎందుకంటే అతని ఫర్నీచర్ చాలావరకు ఎవరో తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది అని సామాజిక కార్యకర్తలు తెలిపారు.

Man Locks Self: ఒంటరితనం చాలా భయానకమైంది. మనిషిని తీవ్రమైన నిరాశ, నిస్పృహలోకి నెట్టి వేస్తుంది. కుంగుబాటుకు గురి చేస్తుంది. అదెంత ప్రమాదకరం అంటే.. జీవితం మీద ఆశ కోల్పోయేలా చేస్తుంది. ఎంతుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనే నిస్పృహను కలిగిస్తుంది. తాజాగా నవీ ముంబైలో జరిగిన ఒక ఘటన ఇందుకు నిదర్శనం.

జుయినగర్ సెక్టార్ 24లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి.. మూడేళ్లుగా తన ప్లాట్ లోనే ఒంటరిగా ఉంటున్నాడు. ఈ మూడేళ్లు అతడు అసలు బయటికే వచ్చింది లేదు. ఎవరితోనూ మాట్లాడింది కూడా లేదు. లోపల నుంచి లాక్ చేసుకున్నాడు. ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ పెట్టుకునే వాడు. ఇలా మూడేళ్లు గడిపేశాడు. దాంతో ఆ గది మొత్తం మానవ వ్యర్థాలతో నిండిపోయింది. ఆ గది నుంచి భయంకరమైన దుర్వాసన వస్తోంది.

అతడి పేరు అనూప్ కుమార్ నాయర్. వయసు 55ఏళ్లు. నవీ ముంబైలోని జుయినగర్ లో నివాసం ఉంటున్నాడు. ఒంటరితనం, నిరాశ, అపనమ్మకం అనూప్ కుమార్ నాయర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మూడు సంవత్సరాలుగా తన ఫ్లాట్‌లో ఒక్కడే ఉంటున్నాడు. ఆహారం వచ్చినప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ చేసేవాడు. తన ఆర్డర్ తీసుకున్నాక డోర్ క్లోజ్ చేసేవాడు.

ఓ వ్యక్తి మూడు సంవత్సరాలుగా తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్న విషయం సోషల్ అండ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ ఫర్ లవ్ (సీల్) అనే సామాజిక సంస్థ కార్యకర్తలకు తెలిసింది. వారు వెంటనే రంగంలోకి దిగారు. అక్కడికి వెళ్లి చూడగా.. నాయర్ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించారు. అతడి రూపం చూసి భయపడ్డారు. తలపై జుట్టు, గడ్డం విపరీతంగా పెరిగిపోయాయి. చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అతడితో మాట్లాడారు. అతడికి నచ్చజెప్పారు. బయటకు తీసుకొచ్చారు. తమ ఆశ్రమానికి తరలించారు. కాలి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న అతడికి చికిత్స అందించారు. కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత అనూప్ తీవ్ర అపనమ్మకంతో బాధపడుతున్నాడని గుర్తించారు.

Also Read: పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ యువతి మిస్సింగ్.. అసలేం జరిగింది..

నాయర్ గదిలో లోపలున్న పరిస్థితులు చూసి అంతా షాక్ కి గురయ్యారు. నాయర్ ను బయటకు తీసుకొచ్చి గుండు కొట్టించారు, షేవింగ్ చేయించారు. స్నానం కూడా చేయించారు. ఇప్పుడు అతడు చూడటానికి కాస్త మనిషిలా ఉన్నాడు. గతంలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పనిచేసిన నాయర్, మానవ వ్యర్థాలతో నిండిన ఆ ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నట్లు తెలిసి విస్తుపోయారు.

నాయర్ తల్లి పూనమ్మ నాయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (టెలికమ్యూనికేషన్స్ బ్రాంచ్)లో పనిచేశారు. తండ్రి కుట్టి కృష్ణన్ నాయర్ ముంబైలోని టాటా హాస్పిటల్‌లో ఉద్యోగం చేశారు. ఆరేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. అనూప్ సోదరుడు 20 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనూప్ ఒంటరి వాడైపోయాడు. తీవ్రమైన నిరాశలో ఉండిపోయాడు. తన ఫ్లాట్ నుండి బయటకు రావడానికి నిరాకరించాడు. అలా మూడేళ్లుగా ఒంటరిగా బతికేస్తున్నాడు.

”నాయర్ తన గదిలోని కుర్చీపై మాత్రమే పడుకుంటాడని చూసి మేము షాక్ అయ్యాము. అతని కాలికి ఇన్ఫెక్షన్ గమనించాము. వెంటనే దానికి వైద్య చికిత్స అందించాము. తల్లిదండ్రులు మరణించిన తర్వాత బంధువులు కొందరు అతడిని సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ నాయర్ ఎవరినీ నమ్మలేదు. ఒంటరిగానే ఉండిపోయాడు. ప్రస్తుతం పన్వెల్‌లోని మా ఆశ్రమానికి అతడిని తరలించాము” అని సీల్ కార్యకర్తలు తెలిపారు.

”నాయర్ చాలా అరుదుగా తన ఫ్లాట్ తలుపు తెరిచే వాడు. అసలు బయటికే వచ్చే వాడు కాదు. ఎవరితోనూ మాట్లాడింది లేదు. తన చెత్తను కూడా తీసేవాడు కాదు. సొసైటీ సభ్యులమే కొన్నిసార్లు అతని చెత్తను బయటకు తీశాం. అతని తల్లిదండ్రుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అతని ఖాతాకు బదిలీ చేయడానికి కూడా మేము అతనికి సాయం చేశాం” అని నాయర్ పొరుగింటి వ్యక్తి చెప్పాడు. ”నాకు స్నేహితులు లేరు. నా తల్లిదండ్రులు, సోదరుడు ఇప్పటికే చనిపోయారు. నా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, నాకు కొత్త ఉద్యోగం దొరకడం లేదు” అని నాయర్ చెప్పాడు.

”ఒక వ్యక్తి తమకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కోల్పోయినప్పుడు ఒంటరితనం ఆవహిస్తుంది. మానసిక క్షోభను అనుభవించడం సహజం. నిరాశ ఎక్కువయ్యే కొద్దీ బయటి ప్రపంచానికి దూరం కావడం మొదలవుతుంది” అని సైకియాట్రిస్ట్ ప్రియాంక తెలిపారు. “ఈ రద్దీగా ఉండే నగరాల్లో సాయం అందక ఎంతోమంది నాయర్ లానే ఒంటరిగా జీవిస్తున్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉండిపోతున్నారు. కుంగుబాటుకు లోనవుతున్నారు. అదృష్టవశాత్తూ నాయర్‌ రక్షించబడ్డాడు. కానీ తాళం వేసిన ఫ్లాట్‌లలోనే చనిపోతున్న వారు లెక్కలేనన్ని మంది ఉన్నారు. వారి మృతదేహాలు రోజుల తర్వాత బయటపడ్డాయి” అని సీల్ సామాజిక సంస్థ చీఫ్ అబ్రహం అన్నారు.