సైఫ్‌ అలీఖాన్‌ కేసు.. పాపం.. ఉద్యోగం కోల్పోయి, పెళ్లి సంబంధం రద్దై ఈ అమాయకుడి బాధలు వర్ణనాతీతం

"మీడియాలో నా ఫొటోలు వచ్చాయి. నాకు కాబోయే భార్య కుటుంబంలోని వారు ఇక తమకు నేను అవసరం లేదని చెప్పారు" అని అతడు తెలిపాడు.

సైఫ్‌ అలీఖాన్‌ కేసు.. పాపం.. ఉద్యోగం కోల్పోయి, పెళ్లి సంబంధం రద్దై ఈ అమాయకుడి బాధలు వర్ణనాతీతం

Akash Kanojia, Saif Ali Khan

Updated On : January 26, 2025 / 8:50 PM IST

సినీనటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన ఘటనలో పోలీసులు మొదట ఆకాశ్‌ కనోజియా (31) అనే డ్రైవర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడు నిందితుడు కాదని నిర్ధారించుకుని వదిలేశారు. పోలీసులు ఆకాశ్‌ను అదుపులోకి తీసుకోవడం వల్ల అతడి ఉద్యోగం పోయింది. అతడి పెళ్లి సంబంధం రద్దైంది.

ఆకాశ్ కనోజియా జనవరి 18న తన పని మీద తాను ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్-కోల్‌కతా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న సమయంలో అతడిని దుర్గ్ స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఉప్పందించడంతో అతడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.

ఆ తర్వాత జనవరి 19న ఉదయం ముంబై పోలీసులు బంగ్లాదేశ్ జాతీయుడైన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అలియాస్ విజయ్ దాస్‌ను థానేలో అరెస్టు చేశారు. అనంతరం దుర్గ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ కనోజియాను విడిచి పెట్టింది. పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడంతో తన జీవితం నాశనమైందని ఆకాశ్ కనోజియా చెప్పాడు.

“మీడియాలో నా ఫొటోలు వచ్చాయి. ఈ కేసులో నేనే ప్రధాన నిందితుడినని చెప్పారు. దీంతో నా కుటుంబం షాక్ అయింది. ముంబై పోలీసుల ఒక తప్పు నా జీవితాన్నే నాశనం చేసింది. నాకు మీసాలు ఉన్నాయి.. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడికి మీసాలు లేవు.

సీసీటీవీలో నిందితుడు కనపడ్డాడు. అతడిని సరిగ్గా గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగారు. నేను ఇంట్లో ఉన్నానని చెప్పిన తరువాత కాల్ డిస్‌కనెక్ట్ అయింది.

నేను నాకు కాబోయే భార్యను చూడడానికి ట్రైనులో వెళ్తున్న సమయంలో దుర్గ్‌లో నన్ను పోలీసులు పట్టుకున్నారు. ముంబై పోలీసులు కూడా అక్కడకు వచ్చి నాపై దాడి చేశారు” అని ఆకాశ్ తెలిపాడు.

చివరకు తనను పోలీసులు వదిలేశారని, ఇప్పుడు తాను పని చేసే సంస్థలోని యజమాని తాను చెబుతున్న విషయాలను పట్టించుకవోడం లేదని, ఉద్యోగం నుంచి తీసేశాడని చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి కుటుంబంలోని వారు సంబంధాన్ని వద్దన్నారని తెలిపాడు. తన కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని అన్నాడు.

Ap Ministers Rating Tension : ఏపీలో మంత్రులకు రేటింగ్ టెన్షన్..! చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?