తల్లి అంత్యక్రియలకు తిరిగి వచ్చాడు… అందరికి కరోనా అంటించాడు!

  • Publish Date - April 4, 2020 / 02:57 AM IST

తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరికి కరోనా వైరస్ అంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా నగరంలో జరిగింది. మోరినాలోని 47వార్డుకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లో ఉంటున్నాడు. తన తల్లి మరణ వార్త విన్న అతడు వెంటనే మార్చి 17న స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి అంత్యక్రియల కోసం  మోరినాలో దిగాడు.

తల్లి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఉన్నట్టుండి అతడితో పాటు అతని భార్య అనారోగ్యానికి గురయ్యారు. తనకు వైరస్ సోకిందనే విషయం అతడికి తెలియదు. తల్లి అంత్యక్రియలు కోసమని వచ్చాడు. తన కారణంగా కుటుంబ సభ్యులంతా అనారోగ్యం పాలయ్యారు. ముందుగా ఆ వ్యక్తికి, అతడి భార్యకు కరోనా టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

అంత్యక్రియలకు హాజరైన వారందరిని గుర్తించిన వైద్యాధికారులు, పోలీసులు హోం క్వారంటైన్ లో ఉంచారు. మొత్తం 30 మంది బ్లడ్ శాంపిల్స్ టెస్టులకు పంపించారు. అందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైరస్ సోకిన వారిలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారందరిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

మోరినాలోని 47వ వార్డును పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఇంటిని శానిటైజ్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తికి నుంచి దాదాపు చాలామందికి ఈ వైరస్ సోకి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇంకా ఎంతమందికి ఈ వైరస్ సోకింది తెలియాలంటే టెస్టులు వస్తేగానీ చెప్పలేమని అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అందరిని హోం క్వారంటైన్ చేసినట్టు చెబుతున్నారు. (కరోనా వైరస్.. మనం పీల్చే సాధారణ శ్వాస ద్వారా మాట్లాడేటప్పుడూ గాలితో వ్యాపిస్తుంది : సైంటిస్టుల హెచ్చరిక)