Madhya pradesh : పసిబిడ్డను సీఎం వేదికపైకి విసిరేసిన తండ్రి .. ఎందుకో తెలిసి చలించిపోయిన సీఎం

బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు గుండె రాయి చేసుకున్నారు. అంతే సీఎం ప్రసంగిస్తున్న వేదికపైకి తమ చంటిబిడ్డను విసిరేశారు. సీఎం షాక్ అయ్యారు..ఏంటమ్మా ఈ దారుణం..అంటూ ప్రశ్నించారు. అసలు విషయం తెలుసుకుని చలించిపోయారు. ఆ బిడ్డనుఅక్కున చేర్చుకున్నారు. ఆ తల్లిదండ్రుల యత్నం ఫలించింది.

Madhya pradesh : పసిబిడ్డను సీఎం వేదికపైకి విసిరేసిన తండ్రి .. ఎందుకో తెలిసి చలించిపోయిన సీఎం

CM Shivraj Singh Chouhan

Updated On : May 17, 2023 / 10:42 AM IST

CM Shivraj Singh Chouhan :  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న క్రమంలో అందరు షాక్ అయ్యే ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బిడ్డను సీఎం వేదికపైకి విసిరేశాడు. దీంతో సభకు వచ్చినవారితో పాటు సీఎం..వేదికపై కూర్చున్నవారంతా షాక్ అయ్యారు. సీఎం దృష్టిలో పడటానికి అతను ఈ దారుణం చేశాడని తెలిసి సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత అసలు కారణం తెలిసి అయ్యో పాపం అని అనుకున్నారు. సదరు తండ్రి తన ఏడాది పసిబిడ్డను ఎందుకు అలా వేదికపైకి విసిరేసాడో తెలుసుకున్న సీఎం శివరాజ్ చౌహాన్ చలించిపోయారు.

 

మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌ పటేల్‌, నేహ భార్యాభర్తలు. ముకేశ్‌ రోజువారీ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ఏడాది బిడ్డ ఉన్నాడు. కానీ పేదవారంటేనే రోగాలకు ఇష్టమేమో..ముకేశ్ దంపతులకు పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు. దానికి వైద్యం చేయించుకునే స్తోమత వారికి లేదు. రోజు కూలీతో వచ్చిన డబ్బులతో కడుపులు నిండటమే గగనంగా మారిని ఈకాలంలో ఇక తమ బిడ్డకు వైద్యం ఎలా చేయించాలో వారికి అర్థం కాలేదు. కానీ బిడ్డను బతికించుకోవటానికి అప్పులు చేశారు. నాలుగు లక్షల రూపాయాలు ఖర్చు చేశారు. ఇక వారి వల్లకాలేదు. ఎక్కడా అప్పు పుట్టటంలేదు. ఆపరేషన్ కు రూ.3.5 లక్షల కావాలని డాక్టర్లు చెప్పారు. కానీ అది తమకు సాధ్యంకాదు.

 

సరిగ్గా అదే సమయంలో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. సాగర్‌ ప్రాంతంలో సభకు వచ్చారని తెలిసింది. తమ బిడ్డను బతికించుకోవటానికి వేరే దారిలేదని భావించిన ఆ తల్లిదండ్రులు గుండె రాయి చేసుకున్నారు. సీఎం సభ జరిగే ప్రాంతానికి ముకేశ్‌, నేహా కూడా వెళ్లారు. కానీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లడం వారికి సాధ్యంకాలేదు. కారణం అందరికి తెలిసిందే. సీఎం వద్దకు డైరెక్టుగా వెళ్లనివ్వరు. పైగా వారు నిరుపేదలు. ఇక అస్సలే సాధ్యంకాదు. సీఎం అనుచరులను కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నాడు ముఖేశ్ తన పరిస్థితి చెప్పుకుని కానీ ఆ ప్రయత్నమూ సఫలంకాలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ముకేశ్‌ గుండె రాయి చేసుకుని సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను వేదికపైకి విసిరేశాడు.

 

అది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు. స్టేజీమీద పడిన బాబును కాపాడి..తల్లికి అప్పగించారు. అనూహ్యంగా జరిగిన ఆ ఘటనకు అందరు విస్తుపోయారు. తరువాత అతను చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఆ బిడ్డ ఆరోగ్య సమస్యను తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఎంత సాహసం చేశారయ్యా..అంటూ మందలించారు. బాబుకు వైద్యసహాయం అందించాలని స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారి సాహసం ఫలించింది. బిడ్డ వైద్యానికి సీఎం ఆదేశించటంతో ముఖేశ్ దంపతులు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.