Manipur Assembly Elections : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మారింది.. ఎప్పుడంటే?

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మారింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని సవరించింది. షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 27న జరగాల్సి ఉంది.

Manipur Assembly Elections

Manipur Assembly Elections : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మారింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని సవరించింది. షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 27న జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం ఫిబ్రవరి 28వ తేదీకి సవరించింది. రెండో దశ పోలింగ్‌ మార్చి 3న జరగాల్సి ఉంది. ఈ పోలింగ్ తేదీని కూడా మార్చి 5కు సవరించినట్టు తెలిపింది. ఈ మేరకు సవరించిన పోలింగ్‌ షెడ్యూల్‌ను గురువారం ఈసీ ప్రకటించింది.

60 మంది సభ్యులున్న మణిపూర్‌ శాసనసభా కాలం ఈ ఏడాది మార్చి 9తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవాతోపాటు మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండో దశ పోలింగ్ ఫలితాలను మార్చి 10న వెల్లడిస్తారు.

మణిపూర్‌ ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంటారు.ఫిబ్రవరి 27 ఆదివారం కావడంతో ప్రార్థనలకు ఇబ్బందిగా ఉంటుందని పలు గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తొలి దశ పోలింగ్‌ తేదీని మార్చాలని ఈసీని కోరాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ తేదీలను ఎన్నికల సంఘం సవరించింది.

ఇన్‌పుట్‌లు, ప్రాతినిధ్యాలు, పూర్వదర్శనం, లాజిస్టిక్స్, గ్రౌండ్ సిట్యుయేషన్‌లు, అన్ని వాస్తవాలు, పరిస్థితులపై ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. మణిపూర్‌లో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తం ఓటర్ల సంఖ్య 20,56,901గా ఉన్నారు.


మరోవైపు.. ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీల డిమాండ్‌ల మేరకు పంజాబ్ ఎన్నికల తేదీని ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ముగిసింది. యూపీలోని పదకొండు జిల్లాల్లో గురువారం సాయంత్రం 6 గంటల వరకు 58.77 శాతం ఓటింగ్ నమోదైనట్లు EC వెల్లడించింది.

తొలి దశలో 11 జిల్లాల్లోని 58 స్థానాల్లో 73 మంది మహిళలు సహా మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ పోలింగ్‌ తేదీని కూడా ఈసీ సవరించింది. రాష్ట్రంలోని పలు పార్టీలు, సిక్కు సంఘాల విన్నపం మేరకు ఒకే దశలో జరుగనున్న పోలింగ్‌ తేదీని ఫిబ్రవరి 14 నుంచి 20కి ఎన్నికల సంఘం సవరించింది.

Read Also : Hijab Row : మతపరమైన దుస్తులు వద్దు… హిజాబ్‌ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు