Manipur: 60 ఏళ్లకు ఆయుధాల్ని విడిచిపెడుతూ ప్రభుత్వంతో సంచలన ఒప్పందం చేసుకున్న మణిపూర్ మిలిటెంట్లు

ఈ ఏడాది మొదట్లో మెయిటై కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా ఇవ్వకూడదంటూ కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర' నిర్వహించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసలో 180 మందికి పైగా మరణించారు.

Manipur: 60 ఏళ్లకు ఆయుధాల్ని విడిచిపెడుతూ ప్రభుత్వంతో సంచలన ఒప్పందం చేసుకున్న మణిపూర్ మిలిటెంట్లు

Updated On : November 29, 2023 / 6:44 PM IST

మణిపూర్‌లోని చట్టవిరుద్ధమైన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) సుమారు 60 సంవత్సరాలకు తన హింసా పద్దతికి ముగింపు పలికింది. కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. నిషేధిత సంస్థతో చర్చలు జరుపుతున్నామని, అవి తొందరలో ఆచరణలోకి వస్తాయని గతంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. అతి త్వరలో ఓ పెద్ద అండర్‌గ్రౌండ్‌ సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అమిత్ షా హర్షం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించాం. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) ఈరోజు శాంతి ఒప్పందంపై సంతకం చేయడంతో ఈశాన్య ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు నెరవేరే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మణిపూర్‌లోని పురాతన సాయుధ సమూహం అయిన UNLF హింసను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరేందుకు అంగీకరించింది. నేను వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి స్వాగతిస్తున్నాను. శాంతి పురోగమన మార్గంలోకి వస్తున్న వారికి శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేశారు.

ఈ ఏడాది మొదట్లో మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా ఇవ్వకూడదంటూ కొండ జిల్లాలలో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసలో 180 మందికి పైగా మరణించారు. రాష్ట్ర జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా ఇతర గిరిజనులు జనాభాలో 40 శాతం ఉన్నారు. వీరు ముఖ్యంగా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.