Ashanna: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆయనపై అలిపిరిలో (2003 అక్టోబరు 1న) జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు అగ్ర నేత ఆశన్న ఇవాళ లొంగిపోయారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నకు అనేక మావోయిస్టు దాడుల్లో కీలక పాత్ర ఉంది.
ఛత్తీస్‌గఢ్, బస్తర్ జిల్లా, జగదల్‌పుర్‌లో పోలీసుల ముందు ఆశన్న పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. పోలీసులకు భారీగా ఆయుధాలను అప్పగించారు. 153 తుపాకులు, 11 గ్రనేడ్ లాంచర్లు, 41 సింగిల్ షాట్ గన్‌లు, లైట్ మెషీన్ గన్‌లు పోలీసులకు ఇచ్చారు.
ఉమ్మడి ఏపీలో జరిగిన కీలక మావోయిస్టు దాడుల్లో కీలక పాత్ర ఆశన్నదే. ఆయన స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, నర్సింగాపూర్ గ్రామం. ఆయన తల్లిదండ్రుల పేర్లు తక్కళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన. ఆశన్న ఐటీఐ పాలిటెక్నిక్ చదివారు. 1990 నుంచి మావోయిస్టుగా మారారు. 2010లో సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీలో చేరారు.