Chhattisgarh Encounter: ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. పన్నెండు మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గ‌ఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గ‌ఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఛత్తీస్ గఢ్, ఒడిశా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, మంగళవారం తెల్లవారు జామున జరిపిన గాలింపులో భద్రతా బలగాలు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. దీంతో నిన్నటి నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న కాల్పుల్లో మృతుల సంఖ్య 14కు చేరింది.

Also Read: Mayor Gadwal Vijayalaxmi : హైదరాబాద్ లో రూ.60 కోట్ల విలువైన పార్క్ స్థలం కబ్జా.. జీహెచ్ఎంసీ మేయర్ సీరియస్..

గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఛత్తీస్ గఢ్ కు చెందిన కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) సంయుక్త భద్రతా సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అయితే, ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, మృతుల్లో కీలక మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా భారీగా ఆయుధాలనుసైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జావాన్ తీవ్రంగా గాయపడగా.. అతడ్ని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయపూర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

గరియాబంద్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇది రెండో ఎన్ కౌంటర్. గతేడాది వేర్వేరు ఎన్ కౌంటర్లలో 219 మావోయిస్టులు మరణించగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మావోయిల మృతుల సంఖ్య 28కి చేరింది.