×
Ad

Airfares: ఫైట్ టికెట్ ధరల పెంపుపై కేంద్రం సీరియస్.. దేశీయ విమాన సర్వీసులకు ఛార్జీలు నిర్ణయం..

ఇలా ఏ ఫ్లైట్ టికెట్ రేటు చూసినా గుండెలు అదిరిపోవాల్సిందే. దీనిపై ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

Airfares: ఇండిగో సంక్షోభం కారణంగా విమాన ప్రయాణం చాలా కాస్ట్ లీగా మారింది. పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా ఈ సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. విమాన టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. కొన్ని రూట్లలో ఫ్లైట్ టికెట్ ధర లక్ష రూపాయలుగా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణ రోజులతో పోలిస్తే టికెట్‌ ధరలను 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెంచేశాయి ఎయిర్ లైన్స్ సంస్థలు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీ-బెంగళూరు ఫ్లైట్ టికెట్‌ ధర లక్ష రూపాయలుగా ఉంది. చెన్నై-ఢిల్లీ టికెట్‌ రేటు 90వేలుగా ఉంది. ఢిల్లీ-ముంబై టికెట్‌ ధర ఏకంగా 54వేలుగా ఉంది. ముంబై – శ్రీనగర్ మార్గంలో సాధారణంగా 10 వేల రూపాయల లోపు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62వేలకు పెరిగింది.

ఇలా ఏ ఫ్లైట్ టికెట్ రేటు చూసినా గుండెలు అదిరిపోవాల్సిందే. దీనిపై ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. విమాన టికెట్ల ధరల పెంపుపై సీరియస్‌ అయ్యింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులను దోచుకోవడం సరికాదంది. సంక్షోభాన్ని క్యాష్‌ చేసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అడ్డగోలుగా రేట్లు పెంచితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన టికెట్‌ ధరలను కేంద్రం క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో వృద్ధులు, విద్యార్థులు, వైద్య సాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని సూచించింది.

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమాన టికెట్ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టిన కేంద్రం.. దేశీయ విమాన సర్వీసులకు ఛార్జీలు నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీ గరిష్ఠంగా రూ.7,500 వసూలు చేసుకోవచ్చు. 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు గరిష్ఠ ఛార్జీ 12 వేల రూపాయలు. 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు గరిష్ఠ ఛార్జీ రూ.15 వేలు. 1500 కిలోమీటర్లు దాటితే ఛార్జీని రూ.18వేలుగా నిర్ణయించింది.

అటు ఇండిగో సంక్షోభంగా 5వ రోజుకి చేరింది. వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో పలు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది.

Also Read: ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇవాళ్టి నుంచే అందుబాటులోకి..