సొల్లు కబుర్లు తగ్గుతాయిలే : మొబైల్ కాల్ ఛార్జీలు పెరుగుతున్నాయి

సొల్లు కబుర్లు తగ్గుతాయిలే : మొబైల్ కాల్ ఛార్జీలు పెరుగుతున్నాయి

Updated On : October 16, 2019 / 5:51 AM IST

జియోతో పాటు వంత పాడుతూ ఇతర నెట్ వర్క్‌లు సైతం చార్జీలు పెంచేందుకు సిద్ధమైపోయాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్‌ జియో చార్జీలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జియోను అనుసరించి తప్పని పరిస్థితుల్లో డేటా చార్జీలు తగ్గించిన నెట్ వర్క్‌లు ఇదే అవకాశంగా చార్జీల పెంపు రాగాన్ని అందుకున్నాయి.

ఈ సందర్భంగా ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనని భారతీ ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరముందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్‌ విఠల్‌ వెల్లడించారు. మరోవైపు, ఇంటర్‌ కనెక్షన్‌ యూసేజ్‌ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఖండించారు.

‘ఈ టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని అనుకుంటున్నాం. దీంతో టారిఫ్‌లు పెరగాల్సిన అవసరముందని భావిస్తున్నాం. టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికాం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది. తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికం, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయి‘ అని ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొని చెప్పారు. 

టెలికాం రంగంలోకి పెట్టుబడులు పెరిగితేనే డిజిటల్‌ ఇండియా సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని సూచించారు. ఇతర నెట్‌వర్క్‌ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. దీనిని పొడిగించేందుకు చూస్తున్నట్లు ట్రాయ్‌ చర్చాపత్రాన్ని విడుదల చేయడంతో వివాదాస్పదంగా మారింది. ఈ కారణంతోనే జియో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను విధించింది.