పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసుల చర్య విషయమై ఇవాళ(డిసెంబర్-17,2019)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. అఖిలపక్ష నాయకుల బృందంతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సోనియా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం సోనియా మాట్లాడుతూ…పౌరసత్వ సవరణ చట్టంపైఈశాన్యరాష్ర్టాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశం మొత్తం వ్యాపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి కూడా. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. మోడీప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుంది. పోలీసులు ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్‌లోకి ప్రవేశించి..వారిని బయటకు లాక్కొచ్చి కనికరం లేకుండా కొట్టడమే దీనికి నిదర్శనం.
ముందుముందు భయానక పరిస్థితులు ఏర్పడుతాయేమోనని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత పద్దతిలో చేస్తున్న నిరసనలను పోలీసులు హింసాత్మకంగా చేస్తున్నారని, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి చెప్పినట్లు ఆమె తెలిపారు.