Sujalam Bharat Summit 2025: కేంద్రం కొత్త స్లోగన్ RRRR.. ఏంటీ 4Rలు.. దేని కోసం..
సరైన తాగు నీరు లేకపోవడం వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Sujalam Bharat Summit 2025: కేంద్ర ప్రభుత్వం కొత్త స్లోగన్ తీసుకొస్తోంది. అదే RRRR. సుజలాం భారత్ 2025లో భాగంగా.. ఈ ప్లాన్ చేసింది. జల్ జీవన్ మిషన్ లో ఈ 4Rలు ఉంటాయి. అందులో మొదటి R అంటే రెడ్యూస్ (నీటి వినియోగం తగ్గించడం), రెండో R అంటే రీయూజ్, మూడో R అంటే రీచార్జ్ (నీటి వనరుల లభ్యత పెంచుకోవడం, భూగర్భ జలాలు పెంచడం), ఇక నాలుగో R అంటే రీసైకిల్ (నీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగించడం). జల శక్తి ఆధ్వర్యంలో, నీతి ఆయోగ్ సహకారంతో ఈ ప్లాన్ చేస్తోంది.
దేశంలో పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోంది. ఉద్యోగ, ఉపాధి, విద్య, ఇతర అవకాశాల కోసం జనం సిటీల బాట పడుతున్నారు. అయితే, దీనికి తగినట్టు వాటర్ అందుబాటులో లేదు. అందుకే మహా నగరాల్లో నీటి కటకట ఏర్పడుతూ ఉంటుంది. పెరుగుతున్న పట్టణీకరణకు సరిపడా నీటిని అందుబాటులో ఉంచడానికి ఏం చేయాలనే దానిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కొత్త స్లోగన్ తీసుకొచ్చింది.
సుజలాం భారత్ విజన్ కింద కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టనుంది. దేశంలోని రాష్ట్రాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనుంది. ఈ ప్రాజెక్టులో నదులను పునరుజ్జీవం చేయడం, వాటర్ మేనేజ్ మెంట్, టెక్నాలజీ ఆధారంగా నీటి వినియోగం, భూగర్భ జలాలు పెంచడం, సురక్షిత మంచినీటి సరఫరా లాంటివి ఏర్పాటు చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది.
సరైన తాగు నీరు లేకపోవడం వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన నీటి లభ్యత లేకపోవడం వల్ల శానిటేషన్ సమస్య ఏర్పడుతోంది. అనారోగ్యాల పాలవుతున్నారు. న్యూట్రిషన్ కూడా అందడం లేదు. ఇలాంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.
నదుల పునరుజ్జీవం కోసం నమామి గంగే లాంటి ప్రాజెక్టులు ఇంకా చేపట్టడానికి అవకాశం ఉంది. దేశంలో ఉన్న ఇతర నదుల విషయంలో కూడా ఇలాంటి నినాదంతో ముందుకెళ్లనుంది. ఇప్పటివరకు సుమారు 15 కోట్ల మందికి జల్ జీవన్ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్ అందించినట్టు చెబుతున్న ప్రభుత్వం 2028 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అందించాలనే టార్గెట్ చేసింది. ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి రోజుకు కనీసం 55 లీటర్ల నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భూగర్భ జలాలను పెంచే క్రమంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఫోకస్ చేయనుంది.
Also Read: క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఓవర్‌లిమిట్ ఫీజు రద్దు.. ఇక కంట్రోల్ కస్టమర్ల చేతుల్లోనే..!
