Tailor Mohanan: మనుషులకు దుస్తులు కుట్టడం కామన్. ఏ టైలర్ అయినా చేసేది ఇదే. కానీ, రాకెట్లకు కూడా దుస్తులు కుడతారు అంటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. అవును.. ఆయన రాకెట్లకు కూడా వస్త్రాలు కుట్టారు. తనదైన ప్రతిభ చూపి సైంటిస్టులతో శభాష్ అనిపించుకున్నారు. ఆయనే దర్జీ మోహనన్.
కేరళ నెడుమంగడ్‌లోని వాండా జంక్షన్‌కు చెందిన దర్జీ మోహనన్ టైలరింగ్‌లో తనదైన పనితీరుతో ఇస్రో సైంటిస్టుల ఆదరణ పొందారు. 67ఏళ్ల మోహనన్.. అనారోగ్య సమస్యలతో ఇటీవలే చనిపోయారు. మోహనన్ కు ఇస్రో సిబ్బంది నివాళి అర్పించింది. ఓ దర్జీగా దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఆయన అందించిన ప్రత్యేక సేవలను ఇస్రో సిబ్బంది గుర్తు చేసుకున్నారు.
ఇస్రో 1987లో కేరళలోని వళియమాలలో తన కేంద్రాన్ని (లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ సెంటర్) ఏర్పాటు చేసింది. అప్పటికే మోహనన్ వాండా జంక్షన్‌లో ఓ చిన్న టైలర్ షాప్ నడిపే వారు. మోహనన్ టైలర్స్ పేరుతో ఆయన షాప్ నడిపారు. 1995 నుంచి ఇస్రో ఉద్యోగులకు దుస్తులు కుట్టడం ప్రారంభించారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి యూనిఫామ్స్ కుట్టేవారు. కొన్ని రోజుల్లోనే తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకు అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించే పరికరాల విడిభాగాలకూ ఆయన సేవలు విస్తరించాయి. రాకెట్ భాగాలు, ఇతర విడి భాగాలను కప్పి ఉంచేందుకు ఉపయోగించే వస్త్రాలను కుట్టడం ప్రారంభించారు. పనిలో మోహనన్ చూపే నిబద్ధతకు శాస్త్రవేత్తలు అట్రాక్ట్ అయ్యారు.
రాకెట్ భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. దుమ్ము, తేమ, వర్షం నుండి రక్షించుకోవాలి. అందుకోసం రక్షణ కవర్లు అవసరం ఎంతైనా ఉంది. రాకెట్ల ప్రయోగానికి ముందు రక్షణ కవర్లను తొలగిస్తారు. ఈ రక్షణ కవర్లను టైలర్ మోహనన్ కుట్టేవారు.
టైలరింగ్ విషయంలో సాధారణ వాటితో పోలిస్తే ఇస్రో అవసరాలు, ఉపయోగించే మెటీరియల్ ఎంతో భిన్నం. దీనికి అనుగుణంగా ఆయన తనను తాను మెరుగులు దిద్దుకున్నారు. రాకెట్ ప్రయోగాల సమయంలో శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫామ్స్ బాగా గుర్తింపు పొందాయి.
ఇస్రో సాధారణ కాటన్ బట్టలను ఉపయోగించదు. రసాయన మిశ్రమాలతో నింపబడిన పదార్థాలను వాడాల్సి వచ్చేది. సంస్థ డిమాండ్ ప్రమాణాలను తీర్చడానికి మోహనన్ అత్యంత సంక్లిష్టమైన కుట్టు పద్ధతులను నేర్చుకోవాల్సి వచ్చింది.
రాకెట్ ప్రయోగాల సమయంలో శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫామ్‌లపై మోహనన్ చేసిన కృషి అంతరిక్ష పరిశోధనా సమాజంలో విస్తృతంగా గుర్తింపు పొందింది. ఇస్రోలో పూర్తిగా నిమగ్నమైన తర్వాత తన వాండా జంక్షన్ టైలరింగ్ దుకాణాన్ని మూసివేశారు.
”మా నాన్న పెద్దగా చదువుకోలేదు. అతను నిత్యం ఇస్రో సంక్లిష్ట పనితీరు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతే రాకెట్ల విడిభాగాల కవర్లను కుట్టడం ప్రారంభించారు” అని మోహనన్ కుమారుడు రాజేష్ గుర్తు చేసుకున్నారు.
ఆల్ కేరళ టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా మోహనన్ ఉన్నారు. రెండేళ్ల క్రితం స్ట్రోక్ వచ్చి ఆయన మంచం పట్టారు. అప్పటివరకు టైలరింగ్ కొనసాగించారు.
దర్జీ మోహనన్ ఇక లేరనే వార్త తెలిసి ఇస్రో ఉద్యోగులు ఆవేదన చెందారు. మోహనన్ ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మోహనన్ కు భార్య విజయశ్రీ, కుమారులు ఎం రాజేష్, ఎం సంతోష్, ఎం నిధీష్, కోడలు లక్ష్మీ చంద్రన్ ఉన్నారు.
Also Read: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల నెత్తిన పిడుగు.. ఈ తేదీ నుంచి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ బంద్..!